రోడ్డుపై బైఠాయింపు: పోలీసుల అదుపులో విజయమ్మ
ఖమ్మం/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా పైనంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలిస్తున్నారు.
నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వైయస్ విజయమ్మ వరద ప్రభావిత ప్రాంతాలలో గురువారం పర్యటిస్తుండగా అడుగడుగునా ఆమెకు తెలంగాణ సెగ తగిలింది. కొణిజెర్లలో తెలంగాణవాదులు ఆమె కాన్వాయ్ పైన కోడిగుడ్లు విసిరారు. అనంతరం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చేరుకున్న విజయమ్మ అక్కడ మనస్సాక్షిగా చెబుతున్న విభజన జరగదని చెప్పారు.

విజయమ్మ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను పలుచోట్ల అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అడ్డంకుల నేపథ్యంలో అధికారులు ఆమెకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఇచ్చారు. పైనంపల్లి వద్దకు చేరుకున్నాక పలువురు తెలంగాణవాదులు ఆమెను అడ్డగించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు విజయమ్మను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేశారు. దానిని నిరసిస్తూ విజయమ్మ, పార్టీ కార్యకర్తలు రోడ్డు పైనే బైఠాయించారు. మరోవైపు తెలంగాణవాదులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు విజయమ్మను అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications