కొణతాల రామకృష్ణకు వైఎస్ విజయమ్మ ఫోన్..! ఎందుకు?
విశాఖపట్నం : కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించి.. అటు తర్వాత వైసీపీలో చేరిన కొణతాల రామకృష్ణ వైసీపీలోను కొన్నాళ్లు పనిచేశాక పార్టీ నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలోనన్న డైలామాలోనే ఉన్నారు కొణతాల. ఇలాంటి సమయంలో ఆయనకు విజయమ్మ నుంచి ఫోన్ అంటే.. అదేదో రాజకీయాంశాల చర్చే అనుకుంటారు చాలామంది.
కానీ అలాంటిదేమి లేదు. కొణతాల సతీమణి పద్మావతి (54) గుండెపోటుతో కన్నుమూయడంతో.. విషాదంలో ఉన్న ఆయన్ను ఫోన్ ద్వారా పలకరించారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. సోమవారం నాడు ఉదయం కొణతాల సతీమణి తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో.. హుటాహుటిన ఆమెను కేర్ ఆసుపత్రికి తరలించారు.

అయితే వైద్యుల శ్రమ ఫలించకపోవడంతో ఆమె తుది శ్వాస విడిచారు. కాగా, ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి, కొణతాల కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. విషాదంలో ఉన్న కొణతాలను ఆత్మీయంగా పలకరించారు విజయమ్మ. ఆయన సతీమణి మరణానికి విజయమ్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications