కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్యకేసు కడప రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ళ క్రితం జరిగిన వివేకా హత్య కేసు ఇప్పటికీ తేలకపోవటంతో తాజాగా ఎన్నికల్లో ఈ అంశాన్ని అస్త్రంగా ప్రజలలోకి వెళ్లాలని భావిస్తున్న వైఎస్ వివేకా కుటుంబం రోజుకో రకం కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తుంది.
సౌభాగ్యమ్మ లేఖతో మళ్ళీ తెరపైకి వైఎస్ వివేకా హత్యకేసు
నిన్నా మొన్నటి దాకా సునీత, షర్మిల వైఎస్ వివేకా హత్యా కేసునే ప్రధాన ఆయుధంగా ఎన్నికల ప్రచారం చేశారు. అయితే కోర్టు ఈ అంశాన్ని ఏ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారానికి వాడకూడదని చెప్పటంతో సైలెంట్ అయ్యారు సునీత, షర్మిల. కానీ మరోమారు వైఎస్ వివేకా హత్యకేసును తన లేఖతో తెరమీదకు తీసుకువచ్చారు వైఎస్ సౌభాగ్యమ్మ.

జగన్ కు రాసిన లేఖలో సౌభాగ్యమ్మ ప్రశ్నలు
తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు రాసిన లేఖలో ఆమె తన కుటుంబ సభ్యులే వైఎస్ వివేకాను హతమార్చారని తాము ఊహించలేదని, ఎవరైతే హత్యకేసులో నిందితుడుగా ఉన్నారో వారికి కడప ఎంపీ టికెట్ జగన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అంతేకాదు ఒక సీఎంగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని కోరుకుంటున్నాను అంటూ జగన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో సునీత, షర్మిల కు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించి వారి పోరాటం అర్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.
కడప రాజకీయాలలో హాట్ టాపిక్ గా సౌభాగ్యమ్మ లేఖ
తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ సౌభాగ్యమ్మ రాసిన లేఖ ఇప్పుడు కడప రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. కడపలో ప్రజలు సౌభాగ్యమ్మ ఆవేదనపై ఆలోచనలో ఉన్నారు. ఇటు జగన్ చేస్తుంది తప్పా.. పదేపదే అవినాష్ రెడ్డికి ఎంపీగా పోటీకి అవకాశం ఇవ్వద్దని కుటుంబమంతా అడుగుతున్నా జగన్ ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతుంది.
షర్మిలకు ప్లస్ గా జగన్ కు మైనస్ గా
ఇదే సమయంలో జగన్ కు సౌభాగ్యమ్మ రాసిన లేఖ వైఎస్ షర్మిలకు ప్లస్ కాగా, వైఎస్ జగన్ కు మైనస్ గా మారుతుంది అన్న భావన వ్యక్తం అవుతుంది. వైఎస్ వివేకా హత్యకేసు నిందితులకు జగన్ అండగా ఉండటాన్ని తప్పు పట్టిన సౌభాగ్యమ్మ ఇప్పటికైనా తమ ఆవేదన అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, జగన్ వ్యవహార శైలిపై తనదైన శైలిలో రాసిన లేఖ ఇప్పుడు షర్మిలకు ఎన్నికల్లో లబ్ధిని చేకూరుస్తుంది అన్న టాక్ వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications