
ఆనాడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. బీసీలంటే చులకన.. ఎందుకు..?
ఓ వైపు ఏపీలో కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. అసంతృప్తులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బాలినేని సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సుచరిత ఇప్పటికే రాజీనామాస్త్రం ప్రయోగించారు. మిగతా అసంతృప్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇటు ప్రతిపక్ష టీడీపీ విమర్శలు కంటిన్యూ చేస్తోంది. బీసీలు అంటే వైఎస్ కుటుంబానికే చిన్నచూపు ఉందట.. ఇదే విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ నాడు వైఎస్ఆర్.. ఇప్పుడు జగన్ అని ఆరోపించారు.
వైయస్ కుటుంబానికి బలహీనవర్గాలంటే ముందు నుంచి కోపం అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా బలహీనవర్గాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారని మండిపడ్డారు. బీసీ నేతలతో టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ విధానాలపై మాట్లాడారు. తండ్రి, కొడుకులకు బీసీలంటే చిన్న చూపు అని చెప్పారు. ఓటు బ్యాంకుగానే పరిగణిస్తారని పేర్కొన్నారు. అవసరం తీరాక పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

బలహీనవర్గాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన ఘనత జగన్‌కు వర్తిస్తోందని అన్నారు. గతంలో బీసీ ఫెడరేషన్లు పెట్టి వైయస్ పైసా నిధులు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పడు కుమారుడు జగన్ కూడా అదే రూట్‌లో నడుస్తున్నారని చెప్పారు. జగన్ బీసీ కార్పొరేషన్లు పెట్టారని.. కానీ వాటి నిధులను లాక్కొని మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురికి పంచారని మండిపడ్డారు. మూడేళ్లలో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించకూడదని సూచించారు. అలా అయితే ఇబ్బందులు తప్పవని అన్నారు. ఇప్పుడు అధికారం ఉండొచ్చు.. కానీ మళ్లీ బీసీలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మెజార్టీ వర్గాన్ని ఇలా చేయడం మంచి పద్దతి కాదని సూచించారు. నమ్మించి మోసం చేయడం అలవాటుగా మారిందని.. దానిని కంటిన్యూ చేస్తున్నారని పైరయ్యారు. బీసీలు ఏం తప్పు చేశారని ఆయన ప్రశ్నించారు.