టిడిపివైపు జగన్ ఎమ్మెల్యేలు చూపు, బాబుతో కాటసాని
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గెలుపొందిన పలువురు సీమాంధ్ర శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలో టిడిపి అధికారంలోకి రావడం, వైయస్ జగన్ కేసులలో ఇరుక్కున్న నేపథ్యంలో సైకిల్ పైన సవారీ చేస్తేనే బాగుంటుందని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరొక్కరు చొప్పున టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇతర జిల్లాల్లోను పలువురు సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే పార్టీలోకి చేరికలపై టిడిపి ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇలాంటి వాటిపై వేచి చూసే ధోరణి అవలంభిస్తేనే బాగుంటుందని టిడిపి అభిప్రాయపడుతోందట. పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందే పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారట. అయితే పార్టీ అధికారంలోకి వస్తే... అనే చిన్నపాటి అనుమానంతో వారు మౌనంగా ఉన్నారట. అలాంటి వారు ఇప్పుడు టిడిపి వైపు చూస్తున్నారని అంటున్నారు.
చంద్రబాబును కలిసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గురువారం కలిశారు. ఆయన ఇటీవలి ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన టిడిపిలో చేరే అవకాశముంది.












Click it and Unblock the Notifications