టీడీపీలో ఉంటే నో, బాబుని అందుకోలేకున్నాం: కామినేని, వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్న వారికి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ మంగళవారం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బలపరుచుకోవడం అంటే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం కాదన్నారు.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో బలమైన నాయకుడు అన్నారు. అందుకే ఆయను తమ పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీజేపీకి ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేగాన్ని తాము అందుకోలేకపోతున్న మాట వాస్తవమే అన్నారు. తమ పని తీరు ఎలా ఉందనేది చంద్రబాబే నిర్ణయిస్తారని తెలిపారు. పారదర్శక పాలనతో తన శాఖను నడిపిస్తున్నానని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి 850 మెడికల్ సీట్లు తీసుకు వచ్చామని చెప్పారు. ఉద్యోగుల హెల్త్ పాలసీ పైన ప్యాకేజీలు మార్చమని ప్రయివేటు ఆసుపత్రులు తమ శాఖను కోరాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు తదితర అంశాల పైన కేంద్రం ఇచ్చిన హామీలు ఎప్పటి నుండి అమలవుతాయనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందన్నారు.
విభజన నేపథ్యంలో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన సహాయం కోసం తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీల కోసం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి సాయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కొన్ని పరిమితులు ఉన్నాయని, కేంద్రానికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయన్నారు.

అక్రమ కేసులకు భయపడం: భూమా నాగిరెడ్డి
అధికార పార్టీ అక్రమ కేసులు బనాయిస్తోందని, వాటికి తాము ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదని వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వేరుగా అన్నారు. తమకు లొంగని ప్రజాప్రతినిధుల పైన రౌడీషీట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రజా సమస్యల పైన ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమన్నారు.
ఎమ్మెల్యేకు గ్రామస్తుల ఝలక్!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డికి ఓ గ్రామస్తులు ఝలక్ ఇచ్చారు! ఆయన అనుచరులు ఏపీలగుంటలో వీరంగం సృష్టించారు. భూకబ్జాకు పాల్పడుతున్న వారిని గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications