తుళ్లూరుతో వ్యాపారమా: బాబుకు వైసీపీ హెచ్చరిక
హైదరాబాద్: తుళ్లూరులో రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పార్థసారథి బుధవారం అన్నారు. ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఈ నెల 23వ తేదీన తమ పార్టీ నేతలు పర్యటిస్తారని చెప్పారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.
భూసేకరణ పైన రైతుల అభ్యంతరాలు, సమస్యలు, ప్రభుత్వ ఒత్తిడి తెలుసుకొని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. రాజధాని భూసేకరణలో అప్రజాస్వామికంగా ముందుకు వెళ్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల భూములతో వ్యాపారం చేసి కోట్లు గడించే కుట్ర చేస్తుందని విమర్శించారు.

తుళ్లూరులో రాజధానికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. తమ పైన తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైతుల భూములతో వ్యాపారం చేస్తే తాము దానిని వ్యతిరేకిస్తామన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు.
పార్టీలకు అతీతంగా అధికారులు పని చేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో టీడీపీ వాళ్లకే పింఛన్లు ఇస్తున్నారని, అర్హులను తొలగిస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications