వైయస్ షర్మిల: లక్ష్యం తాకని జగనన్న బాణం
హైదరాబాద్: జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వెళ్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నించిన వైయస్ షర్మిల ప్రయత్నాలు విఫలమైనట్లే కనిపిస్తున్నాయి. భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందనే అశను ఆమె నెరవేర్చలేకపోయారు. వైయస్ జగన్ వచ్చి రాజన్న రాజ్యం తెస్తాడని పదే పదే చెప్పిన ఆమె మాటలు ప్రజలను కదిలించలేకపోయాయో, నమ్మకం కలిగించలేకపోయాయో తెలియదు గానీ వైసిపి మాత్రం ఓటమి పాలైంది.
వైయస్ జగన్ 16 నెలల పాటు జైలులో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టడానికి తీవ్రంగా కృషి చేశారు.వైయస్ షర్మిల జగనన్న వదిలిన బాణాన్నంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. మరో ప్రజా ప్రస్థానం పేరిట 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజుల పాటు చేపట్టి చరిత్ర సృష్టించారు.

తన మరో ప్రజాప్రస్థానం యాత్రను 2012 అక్టోబర్ 18వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగించారు. రాష్ట్రంోలని 14 జిల్లాలో 116 అసెంబ్లీ నియోజకవర్గాలు, తొమ్మిది కార్పోరేషన్లు, 45 మున్సిపాలిటీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు. ఉప ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే, ఉప ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించినప్పటికీ సాధారణ ఎన్నికల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు ఘోరంగా విఫలమైంది.
ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమె పూర్తిగా పార్టీ అభ్యర్థుల ప్రచారానికే కట్టుబడి పనిచేశారు. విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చివరకు, విశాఖపట్నం లోకసభ నియోజకవర్గంలో తల్లి వైయస్ విజయమ్మ కోసం కూడా ఆమె ప్రచారం చేశారు. కానీ ఫలితం మాత్రం కనిపించలేదు.
అయితే, మోడీ హవాను తట్టుకుని రెండో అతి పెద్ద పార్టీగా, ప్రతిపక్షంగా అవతరించామనేది మాత్రం జగన్‌కు కాస్తా ఊరట కలిగించే విషయమే. కానీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే ఆయన కోరిక మాత్రం రాష్ట్ర విభజన తర్వాత కూడా సాధ్యం కాలేదు.












Click it and Unblock the Notifications