బాబు సర్కార్ పోతుంది, నా పైనా కేసులు, ఏంచేయలేకున్నా: జగన్, ఓటుకు నోటు ప్రస్తావన
విజయవాడ: రెండు మూడేళ్లలో చంద్రబాబు సర్కార్ పోవడం ఖాయమని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ మొత్తం మోసం.. మోసం.. మోసం.. మీద నడుస్తోందన్నారు.
ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు మోడీ కాళ్ల దగ్గర సాష్టాంగపడుతున్నాడని ఆరోపించారు. తన పైన కేసులు ఉన్నాయని, కానీ తాను ఎప్పుడూ భయపడలేదన్నారు. ప్రస్తుతం బలవంతపు భూసేకరణ అన్యాయం తాను ఆపలేకపోయినప్పటికీ పైన దేవుడు ఉన్నాడన్నారు.
కార్పోరేట్ సంస్థల కోసం చంద్రబాబు రాజధానిని నిర్మించాలని చూస్తున్నారని, తద్వారా ఆయన ప్రజల రాజధానిని పక్కన పెట్టారన్నారు. రైతుల కన్నీటితో రాజధానిని నిర్మించాలని చూస్తున్నారన్నారు. ప్రజల కన్నీటితో రాజధానిని కడుతున్నారన్నారు.
రైతులు ఒప్పుకోకపోయినా అధికారం ఉందని, మదమెక్కిన మనస్తత్వంతో బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బాబు తీరుకు వ్యతిరేకంగా, రైతులకు అండగా నిలిచేందుకు వైసిపి ఆందోళనకు దిగిందన్నారు. మాకు మద్దతుగా వచ్చిన అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞత చెబుతున్నానన్నారు.

బలవంతంగా భూములు లాక్కునేందుకు చంద్రబాబు అబద్దాలు కూడా చెబుతున్నారన్నారు. తమ భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో రైతులు ఫిర్యాదు చేస్తే, అక్కడ మూడు పంటలు పండే పంటలు లేవని చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ ఫైల్ దాఖలు చేసిందన్నారు.
సాక్షాత్తు ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఇంకా ఎవరి వద్దకు వెళ్లాలన్నారు. ఇదే గ్రీన్ ట్రైబ్యునల్ భూముల సేకరణపై స్టే ఇచ్చిందని, చంద్రబాబు దానిని విస్మరించారన్నారు. చంద్రబాబు పేర్లు తెలియవని చెబుతూ ప్రకటన ఇచ్చారని, తద్వారా రైతులకు కోర్టుకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదన్నారు.
అన్యాయంగా భూములను లాక్కోవడం తప్పన్నారు. మూడు పంటలు పండించే భూములను లాక్కోవద్దని దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నామన్నారు. బిజెపి ప్రభుత్వం కూడా దీనిపై కదలాలన్నారు. ప్రజలకు, రైతులకు ప్రభుత్వమే అన్యాయం చేస్తే ఎలా అన్నారు.
ముఖ్యమంత్రి అంటే ప్రజల మంచి కోరుకునేవాడని, కానీ భూబకాసురుడు ముఖ్యమంత్రి అయితే ఎలా అన్నారు. అధికారం ఎప్పటికీ మీ వద్దే ఉండదని చంద్రబాబు గుర్తుకు ఉంచుకోవాలన్నారు. రెండేళ్లకో, మూడేళ్లకో త్వరలో మీ ప్రభుత్వం పోతుందన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు.
బలవంతంగా లాక్కున్న భూములను తమ ప్రభుత్వం తిరిగి రైతులకు అప్పగిస్తుందని చెప్పారు. చంద్రబాబు పరిపాలన అంతా మోసం.. మోసం.. మోసం అన్న మూడు అక్షరాల మీద నడుస్తోందన్నారు. ఎన్నికల సమయంలో టిడిపి ఊదరగొట్టారన్నారు. ప్రత్యేక హోదా, ఉద్యోగాల పేరుతో ఊదరగొట్టారన్నారు.
ఇప్పుడు మాత్రం చంద్రబాబు తన మాటను తప్పుతున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చారన్నారు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పి దానినీ చేయలేదన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చెప్పారని, కానీ అవి నెరవేరలేదన్నారు.
అంతా మోసం అన్నారు. అందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పారని, కానీ ఒక్కటీ కట్టించలేదన్నారు. పెన్షన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు చాలామందికి కత్తిరించారన్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదా ఎందుకన్నాడు
హైదరాబాద్ లేకపోయినా ప్రత్యేక హోదా వస్తుందని చంద్రబాబు నాడు చెప్పారన్నారు. ప్రత్యేక హోదా వస్తే గ్రాంటు కింద 90 శాతం నిధులు వస్తాయని, పరిశ్రమలకు పెద్ద ఎత్తున రాయితీలు ఉంటుందని, అప్పుడు పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయన్నారు. తద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
నిన్న ఢిల్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఎందుకని, ప్యాకేజీ కావాలని చెబుతున్నారని జగన్ అన్నారు. విభజన సమయంలో ప్రాజెక్టులు తదితర వాటికి ఇస్తామని చెప్పారని, వాటినే ప్యాకేజీగా కేంద్రం చూపిస్తుంటే, దానిని చంద్రబాబు వెనుకేసుకొస్తున్నారన్నారు.
ఓటుకు నోటు అంశం ప్రస్తావన
ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారని, మొత్తం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నారని, ఒక ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ టిడిపి నేత దొరికిపోయారని, దాని నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రధాని మోడీ వద్ద మోకరిల్లుతున్నారన్నారు.
అయ్యా చంద్రబాబు.. తన పైనా కేసులు ఉన్నాయని, కానీ తాను బయపడలేదన్నారు. సోనియాపై పోరాడానని చెప్పారు. తన పైన కాంగ్రెస్, టిడిపి కుట్రపూరితంగా కేసులు పెట్టాయన్నారు. తన పైన పెట్టినవన్నీ అక్రమ కేసులో అన్నారు. అయినా తాను బయపడలేద్నారు.
29న బంద్‌కు వైసిపి పిలుపునిచ్చిందని, అది జగన్ ఇంట్లో పేరంటం కోసం కాదన్నారు. ప్రజల కోసం అన్నారు.
29న బంద్ నేపథ్యంలో ప్రభుత్వం అరెస్టులు చేస్తుందని, అయినా ప్రజలు భయపడవద్దన్నారు. బందును విజయవంతం చేయాలని, చంద్రబాబుకు బుద్ది వచ్చేలా, కేంద్రం మెడలు వంచేలా ఉండాలన్నారు. మనకు ప్రత్యేక హోదా రావాలన్నారు. హోదాతోనే మన పిల్లలు బాగుపడతారన్నారు.
బలవంతపు భూసేకరణ పైన తాము పోరాడుతామన్నారు. ఇప్పటికిప్పుడు తాము ఈ అన్యాయాన్ని ఆపలేకపోయినప్పటికీ.. పైన దేవుడు ఉన్నాడని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications