రాజంపేట: పురంధేశ్వరికి కష్టమే, జగన్ పార్టీకి చాన్స్
కడప: కడప జిల్లాలోని రాజంపేట లోకసభ స్థానంలో బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. రాజంపటే లోకసభ స్థానంలోని ఐదు శాసనసభా స్థానాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెసుకు అవకశాలు కనిపిస్తున్నాయి. కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు శాసనసభ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయావకశాలున్నాయి.
చిత్తూరు జిల్లాలోని పీలేరు శాసనసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, జై సమైక్యాంధ్ర పార్టీకి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పోటీ ఇచ్చే స్థితిలో లేదు. పీలేరు నుంచి జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు

రాజంపేట లోకసభ స్థానంలోని ఐదు శాసనసభా స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో పురంధేశ్వరికి విజయం అంత తేలికగా చిక్కే అవకాశం లేదు. మదనపల్లి శాసనసభా స్థానంలో ముస్లింల కారణంగా, రాజంపేట శాసనసభా స్థానంలో బలిజ ఓటర్ల కారణంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు.
పీలేరు శాసనసభా స్థానంలో టిడిపి నామమాత్రంగానే ఉంది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఓడించే ఉద్దేశంతో టిడిపి లోపాయికారిగా జైసమైక్యాంధ్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పొత్తులో భాగంగా మదనపల్లి సీటు బిజెపికి వెళ్లింది. అయితే, ఈ నియోజకవర్గంలో 27,691 మంది ముస్లిం ఓటర్లున్నారు. ఇది బిజెపికి వ్యతిరేకం కావచ్చు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు అవకాశంగా తీసుకుంటోంది.
తంబళ్లపల్లి శాసనసభా నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి శంకర్ యాదవ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే, మాజీ శాసనసభ్యుడు సి. ప్రభాకర్ రెడ్డి మద్దతుతో వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుంగనూరు శాసనసభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిట్టింగ్ శాసనసభ్యుడు సి. రామచంద్రా రెడ్డి విజయం సాధించే అవకాశాలున్నాయి.
రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు స్థానాల్లో ముస్లిం ఓటర్ల మద్దతుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ మూడు శాసనసభా స్థానాలు కూడా రాజంపేట లోకసభ స్థానంలో ఉన్నాయి. దీంతో ముస్లిం, రెడ్డి ఓటర్ల సాయంతో రాజంపేట లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications