బిజెపికి వ్యతిరేకం కాదు: షర్మిల, తొందర లేదు: జగన్
కడప/హైదరాబాద్: తాము పొత్తుకు వ్యతిరేకం కాదని అయితే గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకో లేక ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకో తాము అనుకూలం అని కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల బుధవారం అన్నారు.
విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి భారీ ప్రాజెక్టులు, నిధులు అవసరమన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని తాము ఎవరికైనా మద్దతిస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే తాము కలిసేందుకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఈ ఎన్నికలు మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధంగా ఆమె అభివర్ణించారు.

సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి చెప్పారు.
అంతకుముందు షర్మిల వరుసలో నిలుచొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైయస్ జగన్ కడప జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేవుడు ఉన్నాడని, తాను ఏ తప్పు చేయలేదని, ఏం జరుగుతుందో అందరు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
సీమాంధ్రలో తాను క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలనే దానిపై ఇప్పుడే తొందరపడబోమన్నారు. విభజన చాలా అన్యాయంగా జరిగిందని వ్యాఖ్యానించారు. తాను తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముడివడి ఉంటాయన్నారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications