ఆరురోజుల్లో పూర్తయ్యే ఎన్నికలకు వ్యాక్సిన్ సాకా ? నిమ్మగడ్డపై వైసీపీ విసుర్లు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ దీనిపై రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో ఊపుమీదున్న అధికార వైసీపీ ఈ ఎన్నికలు కూడా జరిగిపోవాలని కోరుకుంటోంది. అదీ తాము ఎప్పటినుంచో విభేదిస్తన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే. కానీ అది సాధ్యం కాదని తేలిపోవడంతో వైసీపీ మరోసారి విమర్శలకు దిగింది.
ఏపీలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉండటం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తగినంత సమయం లేకపోవడంతో తాను నిర్వహించలేకపోతున్నట్లు ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై వైసీపీ మండిపడింది. వ్యాక్సిన్ కారణాలతో ఎన్నికలు వాయిదా వేస్తారా అంటూ నిమ్మగడ్డపై ఎదురుదాడికి దిగింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ట్వీట్ చేశారు.

ఆరు రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యాక్సిన్ సాకు చూపుతున్నారని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. కరోనా సెకండ్ వేవ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసి కోవిడ్ వ్యాక్సిన్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు సజ్జల తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో గతంలో కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని, తగ్గాక వద్దని కోరిన వైసీపీ.. ఇఫ్పుడు నిమ్మగడ్డ హయాంలోనే ఎన్నికలు పూర్తి కావాలని ఒత్తిడి తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నిమ్మగడ్డకు పరిషత్ ఎన్నికలు పెట్టాలని తాము ఆదేశాలు ఇవ్వలేమంటూ హైకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో వైసీపీ ఇలా ట్వీట్ల ద్వారా బెదిరింపులకు దిగడమేంటని విపక్షాలు మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications