వైసీపీకి భారీ షాక్-వైజాగ్ మేయర్ సీటుకు ఎసరు! కూటమిలోకి 25 మంది కార్పోరేటర్లు?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మర్చిపోక ముందే వైసీపీకి మరిన్ని ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే పార్టీలో కీలక నేతలు రాష్ట్రస్ధాయిలో కేసులు ఎదుర్కుంటుండగా.. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు సైతం పక్కచూపులు చూస్తున్నారు. దీంతో ఆ పార్టీ గతంలో తొలిసారి గెల్చుకున్న ప్రతిష్టాత్మక వైజాగ్ మేయర్ పీఠం చేజారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీకి చెందిన 25 మంది కార్పోరేటర్లు టీడీపీ, జనసేన నేతలతో టచ్ లో ఉన్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో స్థానిక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్న నేతలంతా అధికార కూటమివైపు చూస్తున్నారు. ఇదే క్రమంలో వైజాగ్ కార్పోరేషన్ లోనూ కార్పోరేటర్లు అధికార టీడీవీ, జనసేనతో టచ్ లోకి వెళ్లిపోయారు. ఇందులో 12 మంది టీడీపీలోకి, మరో 9 మంది జనసేనలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరిని బుజ్జగించేందుకు వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

నిన్న మేయర్ గొలగాని హరికుమారి ఛాంబర్ లో నిర్వహించిన కీలక భేటీకి ఏకంగా 25 మంది వైసీపీ కార్పోరేటర్లు డుమ్మా కొట్టారు. వీరంతా నగర శివారులోని ఓ రిసార్టులో సమావేశమయ్యారు. ఇవాళ టీడీపీ, జనసేనలోకి ఫిరాయించేందుకు వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్ధానిక ఎంపీ భరత్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు వీరితో భేటీ అయ్యారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఇవాళే వీరంతా టీడీపీ, జనసేనలోకి మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైజాగ్ మేయర్ పీఠం వెంటనే దక్కించుకోవడం మాత్రం కుదరదు.
ప్రస్తుతం జీవీఎంసీలో ఉన్న 98 కార్పొరేటర్లలో వైసీపీకి 58 మంది ఉన్నారు. అలాగే టీడీపీకి 27 మంది ఉండగా.. జనసేనకు ముగ్గురు, బీజేపీకి ఒకరు, ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఓ వైసీపీ కార్పోరేటర్ ఇప్పటికే టీడీపీలో చేరారు. అలాగే జీవీఎంసీ పరిధిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కూటమి నుంచి ఉన్నారు. దీంతో కూటమికి 45 మంది సభ్యుల మద్దతుంది. మెజార్టీకి మరో ఐదుగురు ఉంటే సరిపోతుంది. కానీ వైసీపీ నుంచి 22 మంది టీడీపీ, జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
గతంలో వైసీపీ తెచ్చిన చట్టం ప్రకారం నాలుగేళ్ల తర్వాతే మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు వీలుంది. ఈ గడువు ఇంకా ఉండటంతో ప్రస్తుతానికి స్టాండింగ్ కౌన్సిళ్ల పదవులు దక్కించుకునేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. అందుకే ఈ ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications