కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు: సీసీటీవీ ఫుటేజీలో..!!
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మరోసారి భద్రత లోపం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటోండటం పట్ల పార్టీ నాయకులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోన్నారు.
నలుపురంగు కారులో జగన్ ఇంటి సమీపానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తమ చేతిలో ఉన్న వస్తువును జగన్ ఇంటి ముందు విసిరవేశారు. అదే వేగంతో వెళ్లిపోయారు. ఇంటి గేటు ముందు ఉన్న ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది.. దీన్ని గమనించి బయటికి వచ్చే లోపే ఆ కారు దూసుకెళ్లింది.

జగన్ ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో ఇదంతా రికార్డయింది. శనివారం సాయంత్రం 4:32 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాజాగా విడుదల చేయడంతో.. ఇది వెలుగులోకి వచ్చింది.
ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం ఈ మధ్యకాలంలో ఇది నాలుగోసారి. గతంలో వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం వద్ద అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఆవరణకు ఆనుకుని ఉన్న మొక్కలు మంటల బారిన పడ్డాయి. గడ్డి దగ్ధమైంది. దీన్ని గమనించిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంటలను ఆర్పివేశారు.
అంతకుముందు- భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు, కార్యకర్తలు జగన్ ఇంటిపై దాడి చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలకు జగన్ కారణం అయ్యాడంటూ అప్పట్లో బీజేవైఎం నాయకులు జగన్ నివాసాన్ని ముట్టడించారు. జగన్ ఇంట్లోకి చొచ్చుకెళ్లాడానికీ ప్రయత్నించారు.
జగన్ నివాసం, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపైకి చెప్పులు విసిరారు. జగన్ దిష్టిబొమ్మనూ దహనం చేశారు. ఆ తరువాత జనవరి 23వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొందరు కార్యకర్తలు జగన్ ఇంటి ముందు వేడుకలు జరుపుకున్నారు.
కార్లు, బైక్‌లతో భారీ సంఖ్యలో జగన్ ఇంటిముందు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు పదే పదే హారన్ మోగిస్తూ హల్‌చల్ చేశారు. టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూరకంగా జగన్ ఇంటి వద్ద ఈ వేడుకలను నిర్వహించారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది అప్పట్లో. ఇప్పుడు తాజాగా జగన్ ఇంటి ముందు అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం అనేక అనుమానాలకు తెర తీసినట్టయిందని వైసీపీ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications