ఇందాపూర్ వ్యవహారం తెరపై రావడం వల్లే.. !!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదం, ఇందాపూర్ తో హెరిటేజ్ సంబంధాలు ఉన్నాయంటూ ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తెరమీదికి వచ్చారు.
హిందూ మతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నాడని, తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం హేయమని లక్ష్మీపార్వతి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేవ దేవుడి ప్రసాదం మీద విష ప్రచారంతో హిందూ మత విశ్వాసాలను నాశనం చేస్తున్న చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి లేవని అన్నారు.

భయభక్తులు ఉన్నవారు ఇంత నీచంగా తిరుమల లడ్డూ ప్రసాదం గురించి విష ప్రచారం చేయరని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. తన రాజకీయ అవసరాల కోసం కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, తాను చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసే వైవీ సుబ్బారెడ్డి, భూమన కుటుంబాలపై క్రిస్టియన్ ఆరోపణలు చేశాడని స్పష్టం చేశారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టాడనే విషయం ఆధారాలతో సహా బయటికి రావడంతో వాటికి సమాధానం చెప్పుకోలేక కులమత రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని అన్నారు.
1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే తనకు ఏ దేవుడు మీదా నమ్మకం లేదని చంద్రబాబు చెప్పాడని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన రాజకీయ అవసరాల కోసం శ్రీ వేంకటేశ్వరుడు తన కుల దైవం అని కొత్తగా ప్రచారం మొదలుపెట్టాడని, బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసం అదేపనిగా దేవుడి జపం చేస్తున్నాడే కానీ ఆయనకు దేవుడంటే భయం కానీ, భక్తి కానీ లేదని పేర్కొన్నారు.
నిజంగా దేవుడంటే భయభక్తులు ఉన్నవాడు ఇంత నీచంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, బాత్రూమ్‌లు కడిగే రసాయనాలు కలిపారని చెబుతారా? ఏ మతంలోనైనా ఇంత నీచంగా దిగజారి దేవుడి ప్రసాదం మీదనే నిందలు వేసిన వారున్నారా? అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం చూస్తే అడ్డదారిలో అధికారంలోకి వచ్చాడే కానీ, ప్రజలకు సేవ చేసి వారి మన్ననలు పొంది గెలవలేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications