26న భారత్ బంద్‌కు వైయస్సార్సీపీ, ఏపీ ప్రభుత్వం మద్దతు: మంత్రి నాని, బస్సుల నిలిపివేత
అమరావతి: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మార్చి 26న అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు నిర్వహించతలపెట్టిన భారత్ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది.
రైతులు, కార్మికులు చేసే ఆందోళనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మార్చి 26న మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.
విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని నాని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బంద్‌లో శాంతియుతంగా నిరసన తెలపాలని మంత్రి నాని కోరారు.

కాగా, ఇప్పటికే రైతుల భారత్ బంద్ పిలుపునకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. మార్చి 26న దేశ వ్యాప్తంగా సంపూర్ణ భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రైతు నేత రాకేష్ టికాయత్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Recommended Video
ఈ భారత్ బంద్‌కు అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు పలకాలని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కూడా రాకేష్ టికాయత్ వ్యతిరేకించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications