విజయసాయిరెడ్డిపై రూటు మార్చిన వైసీపీ.! తాజా వ్యూహం వెనుక ?
ఏపీ రాజకీయాల నుంచి ఉన్నట్లుండి తప్పుకుని, వైసీపీ, ఎంపీ పదవికీ గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తన మాజీ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసినట్లే కనిపిస్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి తప్పుకున్నాక సైలెంట్ అయిపోతారని, తాను చెప్పినట్లు వ్యవసాయం చేసుకుని బతికేస్తారని భావించిన వారికి ఆయన తాజాగా షాకులిస్తున్నారు. దీంతో వైసీపీకి ఈ వ్యవహారం ముందునుయ్యి, వెనుక గొయ్యిగా మారిపోతోంది.
వైసీపీ ఆవిర్భావం కంటే ముందే వైఎస్ కుటుంబ ఆడిటర్ గా జగన్ గుట్టుమట్లు అన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి ఇప్పటివరకూ ఆయనకు రైట్ హ్యాండ్ లా వ్యవహరించారు. కానీ బీజేపీ ప్రభావమో మరో కారణమూ తెలియదు కానీ హఠాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకుని వైసీపీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేసేశారు. అదే సమయంలో తాను వ్యవసాయానికే పరిమితం అవుతానని కూడా బహిరంగ ప్రకటన చేశారు. దీనికి కట్టుబడి ఆయన సైలెంట్ గా ఉందామనుకున్నా అప్పటివరకూ ఆయన చేసిన తప్పిదాలు వెంటాడుతున్నాయి.

వీటి వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషనో లేక వైసీపీ తనకు అన్యాయం చేసిందన్న బాధో తెలియదు కానీ తాజాగా ఆయన జగన్ ను మాత్రం వదిలేసి ఆయన చుట్టూ ఉన్న కోటరీని టార్గెట్ చేశారు. వారి వల్లే తనకు ఈ సమస్యలు అనుకున్నారో ఏమో కానీ జగన్ బాబాయ్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. విక్రాంత్ రెడ్డి చేసిన కాకినాడ పోర్టు డీల్ తో తనకు సంబంధం లేదని, ఆయనే కర్త, కర్మ, క్రియ అంటూ సీఐడీకి చెప్పడంతో పాటు బహిరంగంగానూ చెప్పేశారు. దీంతో సుబ్బారెడ్డికీ, ఆయనకూ మధ్య ఉన్న గ్యాప్ ఏ స్దాయిలో ఉందో బయటపడింది.
అయితే గతంలో వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పినప్పుడు సాయిరెడ్డి గుర్తించి అంతగా మాట్లాడని వైసీపీకి ఈసారి మాత్రం మాట్లాడక తప్పని పరిస్ధితి ఎదురైంది. సాయిరెడ్డి జగన్ కోటరీ పేరుతో చేస్తున్న విమర్శలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి గురించే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే వారు నేరుగా స్పందిస్తే పరిస్ధితి మరింత దిగజారే ప్రమాదం ఉండటంతో వైసీపీ వ్యూహాత్మకంగా మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ తో ఆచితూచి మాట్లాడించింది. అయితే అందులో వ్యవసాయం చేస్తానంటూ చంద్రబాబుకు సాయం చేస్తున్నారంటూ కాస్త సాఫ్ట్ గానే వారు సాయిరెడ్డికి చురకలు వేశారు.
దీని వెనుక అసలు కారణం వేరే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు సాయిరెడ్డిపై విరుచుకుపడితే ఆయన భవిష్యత్తులో వైసీపీ పూర్తి గుట్టు విప్పేయడం ఖాయమన్న అంచనాలు పార్టీలో ఉన్నాయి. ఈ వివాదం మరింత ముదిరితే ఏకంగా జగన్ కేసుల్లో ఆయన అప్రూవర్ గా కూడా మారే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు నేరుగా జగన్ అక్రమాస్తుల కేసులో పీకల్లోతు ఇరుక్కుపోవడం ఖాయం. ఇవన్నీ తెలుసు కాబట్టే వైసీపీ ఆచితూచి స్పందిస్తోంది. అలాగే సాయిరెడ్డి ఆరోపణలపై అస్సలు స్పందించకుండా వదిలేస్తే పార్టీలో ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్న మరికొన్ని స్వరాలు బయటికి రావడం ఖాయం. అందుకే సాయిరెడ్డి వ్వవహారాన్ని వైసీపీ చాలా సెన్సిటివ్ గా డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications