బెజవాడ కౌన్సిల్ సమావేశం రసాభాస, 'పంచారామ దర్శిని' పేరిట ప్రత్యేక బస్సులు
అమరావతి: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మంగళవారం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ పోరాడిన విద్యార్ధులను అరెస్టు చేయడం దారుణమని సమావేశంలో వైసీపీ కార్పోరేటర్లు స్పష్టం చేశారు.
ఈ సమయంలో మేయర్ సభను సజావుగా సాగేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో, ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదన జరిగింది. ఈ క్రమంలో మేయర్ పై వైకాపా కార్పొరేటర్ బహదూర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
బహదూర్‌ను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసేందుకు టీడీపీ సభ్యులు సిద్ధం కావడంతో వైసీపీ సభ్యులు మేయర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు.

అక్కడితో ఆగకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. దీంతో పరిస్థితి అదుపు దాటి పోతుందని గ్రహించిన ఉన్నతాధికారులు జోక్యం చేసుకోగా చివరకు బహదూర్ క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
'పంచారామ దర్శిని' పేరిట ప్రత్యేక బస్సులు
'పంచారామ దర్శిని' పేరిట ఏపీలో ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. గుంటూరు రీజియన్‌లోని 12 డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రతి శనివారం, ఆదివారం కార్తీక పౌర్ణమి రోజు పంచారామాలకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఒక రోజులో ప్రసిద్ధ త్రిశైవ క్షేత్ర దర్శనం పేరిట మరో ప్యాకేజీ అందుబాటులోకి తెస్తున్నామని రీజినల్ మేనేజర్ శ్రీహరి తెలిపారు. త్రిశైవ క్షేత్ర దర్శనంలో భాగంగా యాగంటి, మహానంది, శ్రీశైలం ఆలయాల సందర్శన చేసుకోవచ్చన్నారు. కాగా, కార్తీకమాసంలో కోటప్పకొండ, శ్రీశైలం, సూర్యలంకకు ప్రత్యేకబస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications