విభజనపై జగన్ పార్టీ నిలదీత: సిపిఎంకు షిండే వివరణ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల బృందం(జివోఎం) ముందు గురువారం వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎం పార్టీలు హాజరై సమైక్యవాదాన్ని వినిపించాయి. మొదట సిపిఎం, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ వాదలను వినిపించాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జివోఎంకు 8 పేజీల వినతి పత్రాన్ని ఇచ్చింది. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించింది. ఓట్లు, సీట్ల కోసం విభజన చేయడం తగదని సూచించింది.
విభజించాలంటే ఓ ప్రాతిపదిక ఉండాలని, ఎన్నో రాష్ట్రాలలో విభజనవాదం ఉన్నప్పటికీ ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌నే ఎందుకు విభజిస్తున్నారని ప్రశ్నించారు. విభజనతో రెండు ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని, వారి మనోభావాలు పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్తితుల్లోను సమైక్యంగానే ఉంచాలని, అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

జివోఎం భేటీ అనంతరం మైసూరా రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జివోఎం భేటీకి మైసూరా రెడ్డి, గట్టు రామచంద్ర రావులు హాజరయ్యారు. తాము పలు అంశాలపై జివోఎంను ప్రశ్నించామన్నారు.
నాన్చుతారా.. తేల్చుతారా?: సిపిఎం
అంతకుముందు జివోఎం భేటీకి హాజరైన సిపిఎం తాము సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని చెప్పింది. విభజనతో ఎక్కువ సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి పలు సూచనలు చేసింది. భద్రాచలాన్ని విడదీయడం న్యాయం కాదని చెప్పారు. పోలవరం డిజైన్‌ను మార్చాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఏదో ఒకటి తేల్చాలని వారు జివోఎంను నిలదీశారు.
విభజన అంశాన్ని నాన్చుతారు లేక తేల్చుతారా అని వారు ప్రశ్నించారు. దానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే తాము ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు షిండే వారికి చెప్పారు. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని, కృష్ణా జలాల ఆధారంతో నిర్మిస్తున్న ప్రాజెక్టులను కేంద్రం పూర్తి చేయాలని సూచించారు.
జివోఎం భేటీకి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications