అల్లు అర్జున్ కు పూర్తి స్దాయిలో అండగా వైసీపీ- లాయర్ల నుంచి జగన్ వరకూ..!
పుష్ప 2 చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు నిన్న అనూహ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటికి వచ్చారు. అయితే ఈ మధ్య సమయంలో వైసీపీ ఆయనకు పూర్తిస్దాయిలో అండగా నిలిచింది. వైసీపీ లాయర్ల నుంచి అధినేత జగన్ వరకూ అందరూ అల్లు అర్జున్ కోసం స్పందించారు.
అల్లు అరెస్టు అయ్యారని తెలియగానే వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగారు. ముందుగా వైసీపీ లాయర్లు రంగంలోకి దిగగా.. ఆ తర్వాత నేతలు సైతం ఎంటరయ్యారు. వైసీపీ ఎంపీ కమ్ లాయర్ నిరంజన్ రెడ్డి, గత ప్రభుత్వంలో ప్రభుత్వ లాయర్ గా పనిచేసిన అశోక్ రెడ్డి ఇద్దరూ అల్లు అర్జున్ కేసు వాదించేందుకు సిద్దమయ్యారు. చిక్కడపల్లి పీఎస్ లో అల్లు అర్జున్ ఉండగానే వీరు నాంపల్లి కోర్టులో ఓ టీమ్, తెలంగాణ హైకోర్టులో మరో టీమ్ సాయంతో అల్లు అర్జున్ రిమాండ్ కాకుండా, బెయిల్ లభించేలా ప్రయత్నించారు. వీరి ప్రయత్నాలు నాంపల్లి కోర్టులో విఫలమైనా హైకోర్టులో ఫలించాయి.

వీరు అంతటితో ఆగలేదు. అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చాక చంచల్ గూడ జైలుకు వెళ్లి అధికారులతో వరుసగా చర్చలు జరిపారు. అర్ధరాత్రి వరకూ అక్కడే ఉండి అల్లు అర్జున్ విడుదల కోసం ప్రయత్నించారు. కానీ జైలు అధికారుల నుంచి తగిన సహకారం లభించకపోవడంతో వెళ్లి పోయి తిరిగి ఉదయాన్నే వచ్చి జైలు నుంచి విడిపించారు. జైలు అధికారుల తీరుపై మండిపడుతూ .. వారిపై తిరిగి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమని అశోక్ రెడ్డి ప్రకటించారు.
మరోవైపు వైసీపీలో చిన్న స్దాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. చివరికి అధినేత వైఎస్ జగన్ కూడా ఎక్స్ లో అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. వీరిలో కొందరు అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు. అలాగే వైఎస్ జగన్ సైతం పోలీసుల తీరుపై తన ట్వీట్ లో ఆగ్రహం వ్యక్తం చేసారు. అలా వైసీపీ నేతలు సైతం పూర్తిస్దాయిలో అల్లు అర్జున్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications