వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..! హైకోర్టులోనే తేల్చుకోమని సలహా..!
ఏపీలో కూటమి సర్కార్ (Ap govt) ఆదేశాలతో తమ సోషల్ మీడియా ఖాతాల్ని (social media accounts) నిలిపివేస్తూ ఆయా ప్లాట్ ఫామ్స్ తీసుకుంటున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన వైఎస్సార్సీపీకి (ysrcp) అక్కడా చుక్కెదురైంది. తమ పార్టీ నడుపుతున్న అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ను, పోస్టుల్ని ఈ మధ్య పదే పదే నిలిపేయడంపై వైసీపీ సుప్రీంకోర్టును (supreme court) ఆశ్రయించింది. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కీలక తీర్పు వెలువరించింది.
వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహంగా ఉన్న కూటమి సర్కార్.. సోషల్ మీడియా సంస్దల సాయంతో ఆయా పోస్టుల్ని, హ్యాండిల్స్ ను నిలిపేస్తోంది. దీనిపై ఇప్పటికే తమ నిరసనలు తెలుపుతున్న వైసీపీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను కోరారు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ మేరకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది. అలాగే ఈ పోస్టుల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులపైనా జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపైనా హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ కు సూచించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో వైసీపీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందా అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.














Click it and Unblock the Notifications