సీబీఐకి వైఎస్ అవినాష్ రెడ్డి లెటర్..!!
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులకు కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. మంగళవారం నాటి విచారణకు రాలేనని స్పష్టం చేశారు.
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. ఇదివరకు సీబీఐ అధికారులు ఆయనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం- మంగళవారం ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీనికి తాను హాజరు కాలేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీీబీఐకి లేఖ రాశారు.
ఇదివరకు- వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మూడుసార్లు విచారణను అవినాష్ రెడ్డి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. విచారణలో తాను ఇచ్చిన స్టేట్ మెంట్స్ ను సీబీఐ దర్యాప్తు అధికారులు మార్చివేస్తోన్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఇదే విషయం మీద అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకూడదంటూ ఆదేశాలు ఇవ్వాలంటూ పిటీషన్ ను దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటీషన్ విచారణ దశలో ఉంది.

మలి విడత వాయిదా కింద మంగళవారం అవినాష్ రెడ్డి హైకోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు తెలంగాణ హైకోర్టు సమక్షానికి వెళ్లాల్సి ఉన్నందున- తాను రేపటి విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన సీబీఐ అధికారులకు లేఖ రాశారు. అదే సమయంలో రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ఇవ్వాళే ప్రారంభం అయ్యాయని, అందులో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందనీ వివరించారు.
దీనిపై ఇప్పటివరకు సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. అవినాష్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించితే- విచారణ వాయిదా పడే అవకాశం ఉంది. వాయిదా పడితే- కొత్త తేదీని పొందుపరుస్తూ మరో నోటీసును అవినాష్ రెడ్డికి జారీ చేసే అవకాశం ఉంది. ఇవ్వాళ కూడా తెలంగాణ హైకోర్టు ఆయన పిటీషన్ పై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. తుది తీర్పు వెలువడేంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సీబీఐ అధికారులకు హైకోర్టు సూచించింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ తో పాటు సునీత రెడ్డి వేసిన ఇంప్లీడ్ పైనా తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. ఆయన కొత్తగా లేవనెత్తిన రెండో భార్య పాత్ర, ఆస్తి పంపకాలు, సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా విచారించాల్సి ఉంటుందంటూ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది ఇవ్వాళ హైకోర్టులో వాదించారు. 35 మంది సాక్ష్యులు, వారి వద్ద నమోదు చేసిన స్టేట్ మెంట్లు, దర్యాప్తునకు సంబంధించిన హార్డ్ డిస్క్ లను సీబీఐ అధికారులు హైకోర్టుకు సమర్పించారు.












Click it and Unblock the Notifications