జనసేనలో చేరిన వైసీపీ కీలక నేత సోదరుడు..మూడు జిల్లాల నాయకుడన్న పవన్...
ప్రకాశం జిల్లా వైసీపీ కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు(స్వాములు), ఆయన కుమారుడు రాజేంద్ర ఇవాళ జనసేనలో చేరారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరిద్దరితో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నేతలు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్వాములుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు జిల్లాలకు చెందిన నేతగా స్వాములును పవన్ అభివర్ణించారు.
పవన్ స్ధాపించిన జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కొండంత అండగా ఉండే పార్టీ అని ఆమంచి స్వాములు తెలిపారు. అలాంటి పార్టీలో తాను చేరడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. పవన్ కు కొండంత అండగా ఉండాలని తన అనుచరులకు ఆయన సూచించారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వ విధానాలు, చర్యల్ని చూస్తున్నామని, వీటి వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. అందుకే పవన్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు.

జనసేనలోకి మనస్ఫూర్తిగా స్వాముల్ని ఆహ్వానిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. కార్తకర్తలకు సమస్య వచ్చే, కష్టం వస్తే పోరాటం చేసే స్వాములు వంటి నాయకులు జనసేనకు అవసరం ఉన్నట్లు పవన్ తెలిపారు. స్వాములు రాక చీరాలతో పాటు విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయన బలం జనసేనకు ఉపయోగపడుతుందని పవన్ పేర్కొన్నారు. జనం బావుండాలంటే జగన్ పోవాలన్నారు. రాజ్యాధికారం ఒక్కరే చేస్తానంటే సరికాదని, పది మంది కూర్చుని మన భవిష్యత్తును నిర్ణయిస్తామంటే కుదరదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని పోరాడి సాధించుకుందామని పవన్ పిలుపునిచ్చారు.
మన జిల్లాల్లో జనసేన ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూద్దామని పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలిపారు. ఎవరు కేసులు పెడతారో చూద్దామన్నారు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నారు. శ్రీకాళహస్తిలో జనసేన నేతపై దెబ్బ పడితే అది పవన్ పై పడిందన్నారు. ఆమంచి స్వాములపై దెబ్బ పడినా పవన్ వస్తాడన్నారు. ఏ జనసేన కార్యకర్తపై దెబ్బ పడినా అది పవన్ పై పడినట్లేనని, అక్కడికి వచ్చి తేల్చుకుంటానన్నారు.
చీరాలలో వైసీపీ నేతగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ సోదరుడైన స్వాములు ఇన్నాళ్లు ఆయనతో కలిసి రాజకీయాలు సాగించారు. కృష్ణమోహన్ రాజకీయానికి అండగా నిలిచిన స్వాములు ఇప్పుడు వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈసారి పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చీరాల లేదా మరో స్ధానం నుంచి ఆమంచి స్వాములుకు జనసేన టికెట్ కేటాయించే అవకాశముంది.












Click it and Unblock the Notifications