అలిపిరి ఘటన.. దేవుడు నీకిచ్చిన వార్నింగ్: బాబుపై అంబటి నిప్పులు..
విజయవాడ: తిరుమల పోటులో తవ్వకాలకు సంబంధించి విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ధర్మపోరాట దీక్ష కోసం జనాలను బలవంతంగా సభలకు తరలిస్తున్నారని మండిపడ్డారు.
ధర్మపోరాట దీక్ష ప్రదేశాన్ని శుద్ది చేసేందుకు వెళ్తున్న ఎంపీ విజయసాయిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు. పోలీసులను చంద్రబాబు తన జేబు సంస్ధగా మార్చుకున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్దం అని మండిపడ్డారు. తిరుపతి, నెల్లూరు, అమరావతిలో గతంలో మోడీ ఇచ్చిన హామిల వీడియోలను చంద్రబాబు ప్రసంగాల్లో చూపిస్తున్నారని, మరి అవే వేదికలపై చంద్రబాబు మాట్లాడిన మాటలను మాత్రం చూపించకపోవడమేంటని ప్రశ్నించారు.

ప్రత్యేక ప్యాకేజీపై హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు అర్ధరాత్రి చేసిన ప్రకటనను ఎందుకు చూపించలేదని అంబటి రాంబాబు నిలదీశారు. ఇది అధర్మం కాదా? అని ప్రశ్నించారు. ఇక ధర్మ పోరాట సభల్లో చంద్రబాబు ఏం ప్రసంగిస్తున్నారో కార్యకర్తలకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీతో వైసీపీ ములాఖత్ అయిందని ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
దేశ రాజకీయాల్లో చంద్రబాబు ఒక నమ్మకద్రోహి అని, కుట్ర అనే పదానికి ఆయనే ఆద్యుడని అంబటి ధ్వజమెత్తారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా అడగలేదని గుర్తుచేశారు. ప్రధాని అమరావతికి వస్తే ప్రత్యేక ప్యాకేజీ అడిగిన ఘనత చంద్రబాబుది అని మండిపడ్డారు.
దైవాన్ని దోచుకునే నీచమైన ప్రక్రియ: అంబటి
చంద్రబాబు నాయుడుకు గతంలో జరిగిన అలిపిరి ఘటన.. భగవంతుడు తన వైఖరి మార్చుకోమని చేసిన హెచ్చరిక అని అంబటి పేర్కొన్నారు. నేడు అదే దైవాన్ని దోచుకునే నీచమైన ప్రక్రియను చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడుకొండల స్వామి విషయంలో చంద్రబాబు చేస్తున్న దానికి వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.
రమణదీక్షితుల ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో ఉండబట్టే.. ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ అని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో పేద బ్రాహ్మణుల కోసం కృషి జరిగిందని అని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications