ఆ జెండాను చూస్తే- సోనియాకు దడ..చంద్రబాబుకు వెన్నులో చలి: రోజా
అధికార వైఎస్ఆర్సీపీ ఇవ్వాళ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకురాలు, మంత్రి ఆర్ కే రోజా క్యాడర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వాళ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది. పార్టీ ఏర్పాటైన ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో ఏపీలో అధికారంలోకి తీసుకుని వచ్చారు వైఎస్ జగన్. 2014 నాటి ఎన్నికల్లో ప్రతిపక్షంగా.. ఆ తరువాతి ఎన్నికల్లో 151 మంది శాసన సభ్యుల బలంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 22 మంది లోక్ సభ సభ్యులతో దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది.

కేంద్ర కార్యాలయంలో..
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకొంటోన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అటు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి హాజరయ్యారు.

అన్ని పార్టీలలాంటిది కాదు..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారీ కేక్‌ను కట్ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా క్యాడర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ అనేది అన్ని పార్టీల లాంటిది కాదని అన్నారు.

సోనియాను గడగడ..
దేశంలోనే అత్యంత శక్తిమంతురాలైన సోనియా గాంధీనే గడగడలాడించిందని అన్నారు. వెన్నుపోటు వీరుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ముద్రపడిన ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి వెన్నులో చలి పుట్టించిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల మనస్సుల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్ఆర్సీపీని స్థాపించారని గుర్తు చేశారు.

అందరి జీవితాల్లో వెలుగులు..
వైఎస్సార్ ను అభిమానించే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులను నింపాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించారని, దీనికి అనుగుణంగా పరిపాలన సాగిస్తోన్నారని ప్రశంసించారు. 2011 మార్చి 12వ తేదీన ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్సీపీ జెండా రాష్ట్రవ్యాప్తంగా రెపరెపలాడుతోందని రోజా పేర్కొన్నారు. ఎవ్వరికీ తలవంచే ప్రసక్తే లేదని చెప్పారు.

పోరాటయోధుడు..
తండ్రి ఆశయాలను సాధించే క్రమంలో- జగన్.. ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా, రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయలేదని, అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు జైలులో పెట్టినా, కత్తితో దాడి చేసినా.. అన్నింటినీ చిరునవ్వుతో భరిస్తూ లెక్కచేయలేదని, తన గమ్యాన్ని చేరుకున్నారని రోజా వివరించారు. జగన్ ఓ పోరాట యోధుడని రోజా అభివర్ణించారు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ ఆయనను ఆశీర్వదించారని, 151 సీట్లతో ఘన విజయాన్ని అందించారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications