మరో పోరుకు వైసీపీ రెడీ-చంద్రబాబుకు ధర్మాన హెచ్చరిక..!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేటు ఆస్పత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలని, లేదంటే వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు యాజమాన్యాల కిందకు తీసుకువెళ్ళి, విద్యార్ధులు, పేదల జీవితాలతో చెలగాటం ఆడేందుకు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా పోరాటంతోనే అడ్డుకుంటామన్నారు. బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్కార్ మెడలు వంచి, దానిని ఉపసంహరించుకునే వరకు వెనకడుగు వేయబోమన్నారు.
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి నాణ్యమైన వైద్యం పొందే పేదవాడి హక్కును కాలరాసిందన్నారు. ఉచిత వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేశారని, దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోందన్నారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేసినా రాష్ట్రంలోని వైయస్ జగన్ నేతృత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడగలిగామని, నాడు కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని గుర్తుచేశారు.

ప్రజారోగ్యం, సమస్యల పరిష్కారం పట్ల వైయస్ జగన్ కి ఉన్న చిత్తశుద్దిని దేశం మొత్తం చూసిందన్నారు. ఆయన స్పందించిన తీరుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నారన్నారు. కరోనా భయాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్న తరుణంలో ఉచితంగా వైద్యం అందించి కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వ ఆస్పత్రులు పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతో సమర్థవంతంగా పనిచేయించుకోవడంలోనూ గత జగన్ నేతృత్వంలోని అధికారులు విజయవంతంగా పనిచేశారన్నారు.

కూటమి ప్రభుత్వం వైద్యం పట్ల ప్రజల్లో భరోసా కల్పించలేకపోతోందని, ఇప్పుడు కరోనా లాంటి విపత్తు ఎదురైతే ప్రాణాలతో ఉంటామన్న ఆశ నేడు ప్రజల్లో సన్నగిల్లిపోయిందని ధర్మాన తెలిపారు. నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. నాణ్యమైన వైద్యం కోరుకోవడం రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు. వాటిని కూడా నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని 16 నెలల పాలనతోనే స్పష్టమైందన్నారు. ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్న గొప్ప లక్ష్యంతో నాటి సీఎం వైయస్ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఏడు కాలేజీలను పూర్తి చేశారని, విశాల దృక్పథంతో కాలేజీల ఏర్పాటు జరిగితే వాటిని ప్రైవేటుపరం చేయాలనుకోవడం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదన్ననారు.












Click it and Unblock the Notifications