వైసీపీలో ఈ సీనియర్ నేతలకు ఏమైంది?
AP elections 2024: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇన్‌ఛార్జీల నియామకం వ్యవహారం.. సీనియర్ నేతల్లో అసమ్మతికి దారి తీస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి బహిరంగంగానే తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
తాజాగా ఈ జాబితాలో మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేరారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమేనని అంటూనే తన అసమ్మతిని బయట పెట్టుకున్నారు. ఇన్‌ఛార్జీల మార్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా మాజీ మంత్రి మేకతోటి సుచరితను నియమించడంపై ఆయన స్పందించారు.

తాడికొండలో శనివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర వేదికపై డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడారు. తాడికొండ ఇన్‌ఛార్జీగా మాజీ మంత్రి మేకతోటి సుచరితను జగన్ నియమించారని, ఆమె గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
మొదట తనను తాడికొండ ఇన్‌ఛార్జీగా జగన్ అపాయింట్ చేశారని, ఆ తరువాత వారం రోజులకే సుచరిత పేరును ప్రకటించారని చెప్పారు. సుచరితను నియమించే ముందు తనను సంప్రదించ లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందంటూ రిపోర్టులు రావడం వల్లే సుచరిత పేరును ఖాయం చేసినట్లు పార్టీ అగ్ర నాయకత్వం వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు.
తాను ఆర్థికంగా చితికిపోయానని, అందుకే ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలోనే వైఎస్ జగన్‌కు చెప్పానని, అయినప్పటికీ- తనపై నమ్మకంతో తాడికొండకు ఇన్‌ఛార్జీగా నియమించారని, ఇప్పుడు సర్వే రిపోర్టుల పేరుతో తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క సారి సీఎం గారిని చూసే అవకాశం కల్పించండని విజ్ఙప్తి చేస్తున్నాను - మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ pic.twitter.com/MTokmfhXD6
— oneindiatelugu (@oneindiatelugu) December 30, 2023
పార్టీలో పని చేసే ఎవరైనా జగన్ ఆదేశాలు తప్పకుండా పాటించాల్సిందేనని, సుచరిత గెలుపు కోసం తాను కృషి చేస్తానని డొక్కా అన్నారు. జగన్‌ను ఒక్కసారి కలవాలనుకుంటోన్నానని, ఆ అవకాశం కల్పించాలని ఆయన బస్సు యాత్ర వేదికపై ఉన్న పార్టీ సీనియర్ నేతలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications