జగన్ అవమానించారు, జనసేనలోకి వెళ్తున్నా: వైసీపీకి తూర్పులో షాక్, వరుస చేరికలు!
రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికలకు ముందు పలువురు నేతలు జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు చిన్నా, పెద్ద నాయకులు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరేందుకు సంసిద్ధమవుతున్నారు. ఇటీవల కాకినాడకు చెందిన ముత్తా గోపాలకృష్ణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
జగన్ వ్యాఖ్యలకు బలమంటూ తేల్చేసిన సాక్షి! బ్రాహ్మణిని కూడా: టీడీపీ ఆగ్రహం వెనుక
ఆయన దారిలోనే మరికొందరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీలలో టిక్కెట్ దొరకవని భావించే ముఖ్య నేతలు, ఆ పార్టీలలో ప్రాధాన్యం లేదనుకునే చిన్నా, పెద్దస్థాయి నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుందని, టీడీపీ, వైసీపీలకు గట్టి పోటీ ఇస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు జనసేనాని వైపు చూస్తున్నారు.

జగన్ టిక్కెట్ ఇస్తానని చెప్పడంతో వైసీపీలో చేరా
ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరనునన్నట్లు ప్రకటన చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేసారు. తనకు మరో ఎనిమిది సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు ఉన్నప్పటికీ జగన్ టిక్కెట్ ఇస్తానని చెప్పడంతో తాను వైసీపీలో చేరానని చెప్పారు.

నన్ను జగన్ అవమానించారు!
కానీ అర్ధాంతరంగా తనను కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పించి తనను, తన కులాన్ని అవమానించారని పితాని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కో ఆర్డినేటర్ పదవి లేకపోయినా ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. తనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలు నచ్చి, వాటి పట్ల ఆకర్షితుడనై తన అనుచరులు, అభిమానులతో చర్చించి వైసీపీకి రాజీనామా చేశానని చెప్పారు. పవన్ జిల్లా పర్యటనలో తన అనుచరులతో కలిసి జనసేనలో చేరుతానని అన్నారు. కాగా బాలకృష్ణతో పాటు మరికొందరు వైసీపీకి గుడ్ బై చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే సైతం
తుని నేత, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కూడా జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తోంది. అశోక్ బాబు పూర్వీకులు తుని సంస్థానాన్ని ఏలిన రాజవంశీకులు. ఆయన తాత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. అశోక్ బాబు.. వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

చాన్నాళ్లకు క్రియాశీలక రాజకీయాలవైపు
ఇప్పుడు మళ్లీ క్రియాశీలక రాజకీయాలపై దృష్టి సారించారు అశోక్ బాబు. ఆయన ఇటీవల వైసీపీలో చేరాలని భావించారని అంటారు. ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తోంది. వైసీపీలో అనుకూలంగా లేదని, జనసేన నాయకులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.

వైసీపీకి మచిలీపట్నం కౌన్సెలర్ రాజీనామా
ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లాలోను వైసీపీకి దెబ్బ తగిలింది. మచిలీపట్నం పురపాలక సంఘానికి చెందిన కౌన్సెలర్ నాంచారయ్య వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌కు, నాంచారయ్యకు మధ్య పొసగడం లేదు. దీంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఆయన టిడిపి లేదా జనసేనలలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!