వైసీపీ నేత కన్నీరు- ఇంతకు ఇంత దెబ్బతీస్తాం
Bhumana Karunakar Reddy: ఊహించినట్టే- తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్చీని తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ఎగరేసుకెళ్లింది. ఏ మాత్రం బలం లేనప్పటికీ- గెలవడం అసాధ్యం అనుకున్న ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ ఉప ఎన్నికను తనకు అనుకూలంగా మలచుకోగలిగింది.
డిప్యూటీ మేయర్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి చెందిన మునికృష్ణ విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ పరాజయం పాలయ్యారు. తిరుపతికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఎన్నిక ఇది.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభినయ్ పోటీ చేయాల్సి రావడం వల్ల ఈ పదవికి రాజీనామా చేశారాయన. ఈ ఉదయం శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా విజయ సాధించడం ప్రాధాన్యతను సంతరంచుకుంది. ఆ పార్టీకి మొత్తం 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పడ్డ ఓట్లు 21.
నిజానికి పోలింగ్ సోమవారమే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కోరం లేకపోవడం వల్ల నేటికి వాయిదా పడింది. తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై మూకుమ్మడి దాడికి పాల్పడటం, వారిని అపహరించడానికి ప్రయత్నించడం, వాళ్లు ప్రయాణిస్తోన్న బస్సుపై రాళ్లు విసరడం వంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కోరం సాధ్యపడలేదు.
బస్సుపై దాడి చేసిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందిన శంకర్ యాదవ్‌గా గుర్తించినట్లు తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. శంకర్ యాదవ్ బస్సు అద్దాలను ధ్వంసం చేశాడని ఆరోపించారు. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలతోనూ అతను అనుచితంగా వ్యవహరించాడంటూ విమర్శించారు.
ఇదిలావుండగా- ఈ ఎన్నికలో ఓటమిపాలైన వైసీీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కన్నీరుమున్నీరయ్యారు. మెజారిటీ కౌన్సిలర్లు సొంత పార్టీకి చెందిన వాళ్లే అయినప్పటికీ- డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ గెలుచుకోవడం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
అక్కడే ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి.. ఆయనను ఓదార్చారు. ఈ ఓటమిపై కరుణాకర్ రెడ్డి ఘటుగా స్పందించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే అధికారంలోకి వస్తామని, ఇంతకు ఇంత దెబ్బ తీయక తప్పదనీ హెచ్చరించారు. పోలీసులను అడ్డుగా పెట్టుకుని, తమ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేసి టీడీపీ ఈ సీటును దక్కించుకోగలిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications