200 కోట్ల ముడుపులు: చంద్రబాబుపై లక్ష్మీపార్వతికి ఎందుకంత కసి?
హైదరాబాద్: తమకు న్యాయం చేయాలని కోరుతూ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు గురువారం ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అగ్రిగోల్డ్ బాదితులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కాగా అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్ధ నుంచి ఏపీ ముఖ్యమంత్రి రూ. 200 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం అగ్రిగోల్డ్ కేసు హైకోర్టు విచారణలో ఉందని, అయినప్పటికీ మంత్రులే వాటి భూములు కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు. వాస్తు, గెస్ట్ హౌస్, సెవెన్ స్టార్ హోటళ్లకు రూ.100 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్న బాబుకు 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల గోడు పట్టదా? అని ఆమె ప్రశ్నించారు.
ఏపీలో వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా అగ్రిగోల్డ్‌పై స్పందించి సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆమె కోరారు. అగ్రిగోల్డ్ ధర్నాలో పాల్గొన్న బాధితులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన అగ్రిగోల్డ్ గోల్‌మాల్ వ్యవహారం బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ, ఒడిసా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది అగ్రిగోల్డ్ బాధితుల బుధవారం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, సీపీఐ ఏపీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం, డైరెక్టర్లు, బీనామీలపేరుతో ఉన్న ఆస్తులను జప్తు చేయాలన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ, తమకు సేవలు అందించాని ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు ఎన్నుకొంటే వారి సంక్షేమాన్ని గాలి కొదిలి అమరావతి, అగ్రిగోల్డ్ స్థలాలను పోటీపడి కొనుగోలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జూలై 14వ తేదీలోగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోతే 15వ తేదీన జాతీయ రహదారులపై వంటావార్పుతోపాటు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications