తారకరత్న మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి
ప్రముఖ నటుడు తారకరత్న మరణంపై వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు చెడ్డపేరు రాకూడదనే ఇన్ని రోజులు ఆయన మరణవార్తను బయటపెట్టనివ్వలేదని ఆరోపించారు.
అమరావతి: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కిందటి నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలించారు. మోకిలలోని స్వగృహంలో నివాళి అర్పిస్తోన్నారు.
తారకరత్న మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, నారా లోకేష్ నివాళి అర్పించారు. సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కన్నీరు పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు.

తారకరత్న మరణంపై వైఎస్ఆర్సీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సంతాపం తెలిపారు. తన కొడుకు తలపెట్టిన యువ గళం పాదయాత్రకు చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే 23 రోజుల పాటు తారకరత్న మరణవార్తను బయటికి తెలియకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని విమర్శించారు. తన స్వార్థం కోసం మరోసారి నందమూరి కుటుంబాన్ని రాజకీయంగా వాడుకున్నాడని ఆరోపించారు.
తారకరత్న బ్రెయిన్ డెడ్ కు గురైనప్పటికీ ఆ వార్తను చంద్రబాబు.. తన పలుకుబడిని ఉపయోగించి ఇన్ని రోజులు బయటికి రాకుండా ఆపారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్ఠగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబు నీచ రాజకీయానికి తన భర్త, ఎన్టీ రామారావు కూడా ఇలాగే కుమిలి కుమిలి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా నారా కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో అభిమానంతో ముందుకు వచ్చాడని చెప్పారు.
తారకరత్న మరణించినట్లు డాక్టర్లు తొలి రోజుల్లోనే నిర్ధారించారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. గుండె ఆగిపోయిందంటూ డాక్టర్లు ధృవీకరించిన తరువాత కూడా చంద్రబాబు తన స్వార్థం కోసం, లోకేష్ పాదయాత్రకు చెడ్డపేరు రాకూడదని, అపశకునంగా ప్రజలు భావిస్తారనే కారణంతో ఆ వార్తను బయటికి రానివ్వలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చంద్రబాబు-నారా లోకేష్ అపశకునమేననే విషయం ప్రజలకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications