ఆ విషయంలో పవన్ కంటే చిరంజీవి ఎంతో బెటర్..
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శల వెల్లువ తగ్గట్లేదు. తెలుగుదేశం పార్టీతో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఆయన తీసుకున్ననిర్ణయం వల్ల జనసేనలో చెలరేగిన అసంతృప్తి చల్లారట్లేదు. పలువురు సీనియర్లు ఇప్పటికే జనసేను గుడ్‌బై చెప్పారు.
Recommended Video

గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేత మేడా గురుదత్త ప్రసాద్.. కొద్దిరోజుల కిందటే వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా గురుదత్త ప్రసాద్ రాజానగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకీ మోయడానికి కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నాడంటూ నిలదీశారు. ఏ రాజకీయ నాయకుడైనా తన పార్టీ ఎదగాలని కోరుకుంటారు గానీ పవన్ కళ్యాణ్ మాత్రం పక్క పార్టీ నాయకుల ఎదుగుదలకు కష్టపడుతున్నారని అన్నారు.
రాష్ట్రం బాగు కంటే తనకి ఏ పదవి ముఖ్యం కాదని పవన్ పదే పదే చెప్పే మాటల్లో అర్థం లేదని విమర్శించారు. నారా లోకేష్, చంద్రబాబు నిర్ణయాలకు పవన్ మద్దతు ఇస్తూ ఉంటే ఆయనకు అండగా, పార్టీను నమ్ముకుని తిరిగిన జనసైనికుల పరిస్థితి ఏంటి అని గురుదత్త ప్రసాద్ నిలదీశారు.
అధికారమే వద్దు అని చెప్పే పవన్ కల్యాణ్.. తనకు తానుగా ముఖ్యమంత్రి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. మాట మీద నిలకడ లేని వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని అన్నారు. అధికారం వద్దనుకున్నప్పుడు కాపులకు రాజ్యాధికారి ఎలా వస్తుందని ప్రశ్నించారు.
రాజ్యాధికారం కోసం కాపులు పవన్ వెంట నడవాలి.. ఆయన పార్టీ జెండాను మోయాలి.. ఆయన మాత్రం తనకు ఎటువంటి ఆశలు లేవు అంటూ వెంట నడిచిన వారి ఆత్మ గౌరవాన్ని మంటలో కలిపేశావని ధ్వజమెత్తారు. దీన్ని సహించలేకే హరిరామ జోగయ్య వంటి కాపు నాయకులు పవన్ కల్యాణ్ వైఖరిని తప్పుపడుతున్నారని మేడా గురుదత్త ప్రసాద్ అన్నారు.

టీడీపీ-జనసేన పొత్తును సమర్ధించని వారిని వైఎస్సార్సీపీ కోవర్టులని పవన్ కల్యాణ్ ముద్రవేస్తోన్నాడని ఆరోపించారు. చంద్రబాబు, నారా లోకేష్, ఎల్లో మీడియా గతంలో పవన్ కల్యాణ్ తల్లిని, ఇంట్లో వారిని అవమానిస్తే ఇప్పుడు మళ్లీ వారి పంచనే చేరాడని, టీడీపీకి అధికారం కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.
ఈ విషయంలో పవన్ కల్యాణ్ కంటే చిరంజీవి ఎంతో మేలు అని, ప్రజారాజ్యం పార్టీ ద్వారా కొంతమంది కొత్త కాపు నాయకులను రాష్ట్రానికి అందించారని పేర్కొన్నారు. జనసేన ద్వారా పవన్ కల్యాణ్ ఎంతమంది కాపులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దారని మేడా గురుదత్త ప్రసాద్ ప్రశ్నించారు.
జనసేనను గెలిపించండి అని స్థాయి నుంచి తెలుగు దేశం పార్టీకి ఓటు వేయాలంటూ పవన్ కల్యాణ్ అడుక్కునే పరిస్థితికి దిగజారి పోయారు మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ అగ్రగామిగా పురోగమిస్తోంటే.. పవన్ కల్యాణ్ ఇంత అమాయకంగా, తెలుగుదేశం పార్టీని నమ్మడమే కాకుండా, కాపులను కూడా తన వెంట నడవాలని అడగటం అవమానకరమని గురుదత్త ప్రసాద్ విమర్శించారు.












Click it and Unblock the Notifications