సునీత విమర్శల వెనుక, అసలు లక్ష్యం..!!
పులివెందుల వేదికగా ఆసక్తి కర రాజకీయం మొదలైంది. వివేకా హత్య కేసు పైన సుప్రీం కోర్టులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక టీడీపీ, వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తాజా పరిణామాల పైన వివేకా కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. అయితే.. సునీత వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. సునీత వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారు.. అసలు లక్ష్యం ఉందని చెప్పుకొస్తున్నారు.
సునీత తాజాగా పులివెందుల పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు స్పందించారు. సునీత కొంత కాలంగా సీఎం చంద్రబాబు చేతుల్లో రాజకీయ కీలుబొమ్మ గా మారారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. ఎప్పుడు కడప జిల్లాలో ఏ ఎన్నిక జరుగుతున్నా సునీతమ్మను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రంగంలోకి తీసుకువస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని గ్రహించడంతో సునీతమ్మను తీసుకువచ్చి వైసీపీపై బుదరచల్లించే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసులో హంతకుడు దస్తగిరికి, చంద్రబాబుకు న్యాయవాది ఒక్కరేననే విషయం తెలిసి కూడా ఈ కుట్రను ఆమె గ్రహించలేదా అని ప్రశ్నించారు.

కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని రాజకీయంగా, వ్యక్తిత్వపరంగా నాశనం చేయాలనే లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారా అని నాగార్జున ప్రశ్నించారు. కడప జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంలోనూ ఒకవైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై చంద్రబాబు ప్రోత్సాహంతోనే టీడీపీ గూండాలు భౌతిక దాడులకు దిగి, భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఈ దాడులపై ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. మరోవైపు వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులను మరసారి రంగంలోకి దింపి రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్యను రాజకీయం చేసి, గత రెండు ఎన్నికల్లోనూ చంద్రబాబు లబ్ధి పొందేందుకు ప్రయత్నంచారని విమర్శించారు. సీబీఐ తన దర్యాప్తు పూర్తి చేశామని సుప్రీంకోర్ట్‌లో చెప్పిందని గుర్తు చేసారు. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యపడుతుందని నాగార్జున వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications