సాయిరెడ్డి బట్టే బాజ్-విచారణకు అప్పుడే వస్తా- రాజ్ కసిరెడ్డి ఆడియో రిలీజ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో సాక్షిగా ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా పిలిపించారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గత ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డికి నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కావడం లేదు. దీంతో తాజాగా హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డి ఇవాళ ఆడియో విడుదల చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులపై రాజ్ కసిరెడ్డి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. ఇందులో ఆయన
లిక్కర్ కేసులో తనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలన్నారని తెలిపారు. నోటీసులపై 24 గంటల్లోనే తాను స్పందించానని, తనను ఎందుకు రమ్మంటున్నారని అడిగానని వెల్లడించారు. ఏమైనా డాక్యుమెంట్స్ తేవాలా అని అడిగినట్లు పేర్కొన్నారు. విచారణకు తాను సహకరిస్తానని చెప్పానని, ఈ మెస్సేజ్ పెట్టాక రెండో నోటీసు ఇచ్చారని తెలిపారు.

కేసులో ప్రాథమిక సమాచారం ఇవ్వాలని కోరినట్లు రాజ్ తెలిపారు. మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. నేను లేని టైమ్‍లో తన తల్లికి నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. సాక్షిగా తనకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. సాక్షిగా విచారణకు పిలిచి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని లాయర్లు చెప్పారు. తనకు వచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేశానన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశానన్నారు. న్యాయ సలహా తీసుకున్నాక విచారణకు వస్తానని తెలిపారు.
మరోవైపు మద్యం కుంభకోణంలో తన పేరు పదే పదే ప్రస్తావిస్తున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్ విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి ఒక బట్టేబాజ్ మనిషి అన్నారు. విజయసాయి చరిత్రను అందరి ముందు పెడతానని హెచ్చరించారు. అప్పటివరకు తనపై ఏకపక్షంగా వార్తలు వేయకండని మీడియాను రాజ్ కసిరెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications