సీఐడీ విచారణకు సజ్జల-పోటెత్తితే జైళ్లు సరిపోవని హెచ్చరిక..! మాకే పాఠాలా ?
ఏపీ సర్కార్ పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని సృష్టిస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసమర్థ పాలనతో హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇవాళ గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయన.. ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
అసమర్థ పాలనతో ఎన్నికల హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్ళించేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో తప్పుడు కేసులు పెట్టి వైసీపీని భయపెట్టాలనుకోవడం చంద్రబాబు అవివేకమన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఆరోపణలపై పోలీసుల దర్యాప్తునకు సహకరించాలనే ఉద్దేశంతో బాధ్యతగల పౌరుడిగా సీఐడీ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు.

టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన సమయంలో తాను ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, ఈ విషయం గతంలో విచారణకు హాజరైనప్పుడే చెప్పినట్లు తెలిపారు. ఇవాళ కూడా విచారణ సందర్భంగా తనను అడిగినప్పుడు మళ్లీ ఇదే విషయం చెప్పానన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు గతంలోనే పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. కోట్ల మంది ప్రజాభిమానం ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు పట్టాభిలాగా ఆయనను అసభ్యంగా దూషించడంపై చాలా ఆవేదన కలిగిందని, ఆక్రోశం వచ్చిందని, అంత అసభ్యకరంగా చెప్పలేని రీతిలో మాట్లాడినప్పుడు దీనికోసమా రాజకీయాల్లో ఉన్నామా అనే బాధ కలిగిందన్నారు.
దాడులకు ప్రతిదాడులే పరిష్కారం అని మాత్రం ఎప్పటికీ తాము అనుకోలేదన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతిమాటను ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుందన్నారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇరువర్గాలు సంయమనం పాటించడం చాలా ముఖ్యమన్నారు. ఇవాళ విచారణలో తెలిసిన విషయాలు ఏవైనా ఉంటే చెప్పమని అడిగారని, మీరు అడిగేవన్నీ తనకు తెలియదని చెప్పానన్నారు. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా రావడానికి సిద్ధమేనని చెప్పానన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రెడ్ బుక్ పాలన పేరుతో వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, రెడ్ బుక్ పేరుతో మరీ ఇంత దారుణంగా వ్యవస్థలన్నింటినీ తద్వారా రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారనుకోలేదన్నారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రాక ముందు నుంచే మొదలైన కూటమి నాయకుల దాడులు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత పథకం ప్రకారం ప్రణాళికబద్ధంగా జరుగుతున్నాయన్నారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలంటేనే ఆలోచించాలనే విధంగా భయాందోళన సృష్టించడమే వీరి ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఇలాగే వ్యవహరించి ఉంటే ఈరోజు టీడీపీ బతికుండేదా అని ప్రశ్నించారు. ? రేపు మేం అధికారంలోకి వస్తే వారి పట్ల ఎలా ఉండాలో వీళ్లు నేర్పిస్తున్నట్టుగా ఉందన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. ఇదే పని మేం మొదలుపెడితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో వారి ఊహకే వదిలేస్తున్నామన్నారు.
వేధింపులు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులతో వైయస్సార్సీపీ కార్యకర్తలను అణగదొక్కాలనుకుంటే అంతకన్నా అవివేకం ఉండదన్నారు. తమ కార్యకర్తలంతా పోటెత్తితే రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎంతోకాలం ప్రజల దృష్టిని మళ్లించలేరన్నారు. ఏడాది పాలనతో చేసిన డైవర్షన్ పాలిటిక్స్ చూసి ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని, నాలుగు మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications