త్వరలో కౌంటర్ ప్లాన్..! సజ్జల కీలక ప్రకటన..!
ఏపీలో వైసీపీ నేతలపై అంతకంతకూ పెరుగుతున్న పోలీసుల దాడులపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజాగా విడదల రజనీపై పోలీసుల దాడితో పాటు ఇతర ఘటనలపైనా చర్చించారు. అనంతరం కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరుగారుస్తూ, రాజకీయ కక్షసాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై నేతలతో ఆయన చర్చించారు.

రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై ఈ సందర్భంగా వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు.
కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనంను ప్రజలు ముందు పెట్టేందుకు వైయస్ఆర్‌సీపీ ఒక కార్యాచరణను సిద్దం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు.
పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణని సజ్జల అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు డీజీపీ అపాయింట్‌మెంట్ కోరినా స్పందించ పోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంను వైయస్ఆర్‌సీపీ సీరియస్‌గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications