"పరిటాల సునీత దౌర్జన్యం.. ఆ ఎన్నిక రద్దు చేయాల్సిందే!"
అసలు ఎన్నిక అనేదే లేకుండా ఆర్డీవో డిక్లరేషన్ ఇచ్చేశారని ప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనంతపురం: జిల్లాలోని కనగాపల్లె ఎంపీపీ స్థానం కోసం జరిగిన ఎన్నికపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. ఎన్నిక జరిగిన తీరు దౌర్జన్యపూరితంగా ఉందని, చేతగాని మంత్రి పరిటాల సునీత చేసిన దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా గమనిస్తోందని వైసీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
అసలు ఎన్నిక అనేదే లేకుండా ఆర్డీవో డిక్లరేషన్ ఇచ్చేశారని ప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీపీ ఉపఎన్నికలో సభ్యులెవరూ చేతులు ఎత్తలేదని, సంతకాలు కూడా చేయలేదని, తమ సభ్యులను బలవంతంగా ఒత్తిడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.కనగాపల్లె ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

వైసీపీ తరుపున ఉన్న బిల్ల రాజేంద్ర, వెంకట్రామిరెడ్డిలను కొట్టారని తోపుదుర్తి ప్రకాశ్ ఆరోపించారు. సీఐ సైతం లోపలే ఉండి దౌర్జన్యానికి సహకరించారన్నారు. ఇప్పటికీ ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు తమతోనే ఉన్నారని చెప్పుకొచ్చిన ప్రకాశ్ రెడ్డి.. తమ సభ్యులైన రాజేంద్ర, వెంకట్రామిరెడ్డిలను కొట్టి లాక్కెళ్లిపోయారన్నారు.
దౌర్జన్యం ద్వారా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిటాల సునీత ఖూనీ చేశారని తోపుదుర్తి ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో తమ పార్టీ బీసీలకు టికెట్ ఇస్తే.. పరిటాల సునీత మాత్రం అగ్రవర్ణాల అభ్యర్థిని ఎంపీపీ చేయాలని పట్టుబట్టారని, అనుకున్నట్టుగానే బలవంతంగా పంతం నెరవేర్చుకున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications