ఆ నియోజకవర్గాల్లో వైసీపీదే హవా, కానీ - తాజా సర్వేలో కీలక అలర్ట్స్..!?
ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీదే హవా, కానీ అప్రమత్తంగా ఉండాల్సిందేనంటున్న సర్వే నివేదికలు
ఏపీలో ఎన్నికల మూడ్ మొదలైంది. పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేస్తున్నాయి. గెలుపు అవకాశాల పై సర్వేలు ప్రారంభించాయి. సర్వే సంస్థల నుంచి అందుతున్న రిపోర్టుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఏపీలో ఎస్టీ నియోజకవర్గాల పరిస్థితి పైన ఒక సర్వే సంస్థ కీలక నివేదిక వెల్లడించింది. 2019 ఎన్నికల్లో అన్ని ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. కానీ, ఇప్పుడు అక్కడ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీకి అనుకూలంగా కనిపిస్తున్నా..అక్కడే అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వైసీపీకే మెజార్టీ స్థానాలు.. పోటా పోటీగా
ఈ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలత కనిపిస్తోంది. మెజార్టీ స్థానాలు వైసీపీ గెలుచుకోనున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ, ఇప్పుడు పొత్తులు తెర మీదకు రావటంతో టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీతో గట్టి పోటీ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ ఏడు స్థానాల్లో ఆధిక్యత కనిపిస్తుండగా.. టీడీపీ ఒక స్థానం లో ముందంజలో ఉన్నట్లు తేలింది. వైసీపీ - టీడీపీ మధ్య ఓట్ల శాతం తేడా దాదాపు ఆరు శాతంగా ఉంది. అదే సమయంలో జనసేన కూడా ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నట్లుగా సర్వే లెక్కలు చెబుతున్నాయి. వేర్వేరుగా పార్టీల బలాబలాలు చూసిన సమయంలో జనసేన బలం కూడా దాదాపు 6 శాతంగా ఉంది.

2019 ఎన్నికల తరువాత మార్పు
2014,2019 ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీదే ఆధిక్యత కనిపించింది. ఆ ఎన్నికల్లో ఒక్క పోలవరం సీటు మాత్రమే టీడీపీ గెల్చుకోగా మిగతా ఆరు సీట్లను వైసీపీ దక్కించుకుంది. కానీ, 2019లో ఎక్క ఎస్టీ సీటు కూడా టీడీపీకి దక్కలేదు. దీంతో, అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదుగురు డిప్యూటీ సీఎంల కేటాయింపులో ఎస్టీ వర్గం నుంచి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణికి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారు. కేబినెట్ విస్తరణ తరువాత విజయనగరం జిల్లాకే చెందిన రాజన్నదొరకు ఎస్టీ కోటాలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్టీలకు ప్రాధాన్యత దక్కలేదని పదేపదే జగన్ ఆరోపించేవారు. ప్రస్తుతం పోలవరం నియోజకవర్గంలో మాత్రమే వైసీపీ వెనుకబడి ఉన్నట్లు సర్వే తేల్చింది.

ఆరు స్థానాల్లో వైసీపీ ఆధిక్యత
ఎస్టీ నియోజకవర్గాల్లో రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజవకర్గాల్లో వైసీపీకి పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు. కానీ, పోలవరం నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి టిడిపికి కొంత అనుకూలంగా మారినట్లు స్పష్టం అవుతోంది. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం, నిర్వాసితులకు నష్టపరిహారం అంశాలు అక్కడ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులను పోలవరం నియోజకవర్గంలో వైసీపీ సరి చేసుకుంటే ఫలితంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అయితే.. గత ఎన్నికల కంటే ఇప్పుడు ఎస్టీ నియోజకవర్గాల్లో మార్పు కనిపిస్తోంది. టీడీపీ - జనసేన పొత్తు ఈ నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో..ఇప్పుడు ఆధిక్యతలో ఉన్నా..వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అసవరం ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications