చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కరెడ్డి స్థానంలో వైసీపీ కొత్త అభ్యర్ధి..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్దుల ఖరారుపైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. అందులో భాగంగా చిత్తూరు జిల్లా కీలకం కానుంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఈ సారి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్దులు మారే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా చంద్రగిరిలో ఎవరు పోటీ చేస్తారనే అంశం పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.
చెవిరెడ్డి భాస్కర రెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు మద్దతుగా నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని నామినేటెడ్ పదవుల నుంచి తొలిగించినా..చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాత్రం తుడా ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.

అదే సమయంలో తుడా ఛైర్మన్ హోదాలో టీటీడీ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. ఇక..ఎన్నికలు..సీఎం జగన్ నివాసంలో జరిగే పర్వదినాల్లో చెవిరెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ సత్సంబంధాలు ఉన్నాయి.
వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి తాను పోటీ చేయకుండా తన కుమారిడికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ ను కోరారు. పార్టీలో వారసులకు టికెట్ల కేటాయింపు అంశం పైన భారీ లిస్టు సీఎం జగన్ వద్ద పెండింగ్ ఉంది. దీంతో..వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలకు మినహాయించి వారసుల విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రాలేదని తెలుస్తోంది.
ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇద్దరూ తమ వారసులను సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే భూమన కుమారుడు తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆయనకు సీటు వచ్చే ఎన్నికల్లో దక్కుతుందనే ప్రచారం ఉంది.

ఇప్పుడు చంద్రగిరికి లో కుమారుడు మోహిత్ రెడ్డిని నిలబెట్టాలని చెవిరెడ్డి చూస్తున్నారు.మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపీపీ గా కొనసాగుతున్నారు. చంద్రగిరి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తన కుమారుడికి సీటుకు సంబంధించి సీఎం జగన్ నుంచి చెవిరెడ్డి హామీ పొందారని ప్రచారం సాగుతోంది.
దీనికి సంబంధించి నియోజకవర్గాల్లో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. చెవిరెడ్డి ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది. ఎన్నికల వేళ పార్టీ సీనియర్లలో కొందరిని పోటీ నుంచి తప్పించి ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎలక్షన్ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఇక.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సీటుకు సంబంధించి పార్టీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications