వైసీపీ నుంచి ముగ్గురు - రాజ్యసభలో టీడీపీ తొలిసారి "ఖాళీ"..!!
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ ప్రతిష్ఠాత్మంగా భావించాయి. మూడు స్థానాలకు ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఏపీ శాసనభలో ఉన్న పార్టీల బలాల ఆధారంగా వైసీపీ మూడు స్థానాలకు అభ్యర్దులను ప్రకటించింది. సీఎం జగన్ వారికి బీఫాం ఇచ్చారు. టీడీపీ పోటీ చేయాలని భావించినా..ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ మూడు స్థానాలు దక్కించుకుంటే 41 సంవత్సరాల టీడీపీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది.
పెద్దల సభకు ఎన్నికలు : ఏపీ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారిలో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ రిటైర్ కానున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సభలో సంఖ్య బలం ఆధారంగా ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి ప్రస్తుతం సభలో 151 మంది ఉన్నారు. దీంతో వైసీపీ ముగ్గురు సభ్యులను గెలుచుకొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ ఈ సారి సీటు దక్కించుకోకుంటే రాజ్యసభలో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల వేళ ఈ పరిణామం ప్రతికూలంగా మారుతుందని చంద్రబాబు ఆలోచన చేసారు.

టీడీపీ పోటీ చేసేనా : రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి టీడీపీ కసరత్తు చేసింది. వైసీపీలో సీట్లు దక్కని వారి మద్దతు సేకరించే ప్రయత్నం చేసింది. టీడీపీకి ప్రస్తుతం 18 మంది సభ్యుల బలం ఉంది. మరో 26 మంది మద్దతు అవసరం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించిన వైసీపీ నలుగురి పైన చర్యలు ఖాయంగా కనిపిస్తున్నాయి. దీంతో...టీడీపీకి 26 మంది మద్దతు కూడగట్టటం కష్టంగా మారుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. టీడీపీ పోటీ చేసే అంశం పైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వైసీపీలో సీట్లు దక్కని వారు కొందరు తిరిగి పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించారు. దీంతో, 26 మంది మద్దతు దక్కుతుందా లేదా అనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే పోటీ పైన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేదు.

వైసీపీ సభ్యుల నామినేషన్లు : ఈ సమయంలోనే వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, రఘునాధ రెడ్డికి సీఎం జగన్ బీఫాంలు ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డికి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కలేదు. ఆయనకు రాజ్యసభకు పంపిస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు. రఘునాధరెడ్డి, గొల్లబాబురావుకు సీట్ల సర్దుబాటులో భాగంగా రాజ్యసభ సీట్లను కేటాయించారు. ముగ్గురు అభ్యర్దుల గెలుపు కోసం కావాల్సిన ఎమ్మెల్యేలను వైసీపీ కేటాయించింది. అదే సమయంలో టీడీపీ ఒక వేళ పోటీలో ఉన్నా.. అందుకు తగిన విధంగా వ్యూహాలు సిద్దం చేసారు. ఓటింగ్ లో ప్రాధాన్యతలను ఖరారు చేసారు. ఇక, టీడీపీ చివరి నిమిషంలో పోటీకి దిగితే మినహా.. వైసీపీ ముగ్గురు సభ్యులు ఎన్నికల ఖయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications