భూమా సహా 8మందిపై జగన్ ఫిర్యాదు!: తలుపులేశారు.. రాలేకపోయిన కెఈ
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం సమయంలో ఓటింగుకు హాజరుకాని ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభాపతి కోడెల శివప్రసాద రావును కోరనుంది. కొద్ది రోజుల క్రితం వైసిపి తరఫున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.
వారి పైన చర్యలే లక్ష్యంగా జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే, వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన ఆ ఎనిమిది మంది సభ్యులు ఓటింగుకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారి పైన చర్యలు తీసుకోవాలని వైసిపి సభాపతిని కోరనుంది.
సభలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో టిడిపి 112 (వైసిపి నుంచి చేరిన 8 మంది ఎమ్మెల్యేలు, స్వతంత్రులు కలిపి), బిజెపి 4, వైయస్సార్ కాంగ్రెస్ 59 మంది ఉన్నారు. స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం సమయంలో అవిశ్వాసానికి వ్యతిరేకంగా (ప్రభుత్వానికి మద్దతుగా) 97 మంది, అవిశ్వాసానికి అనుకూలంగా 57 మంది ఓటు వేశారు. 154 మంది ఓటింగుకు హాజరయ్యారు.

ఓటింగ్‌కు గైర్హాజరైన వారిలో వైసిపి నుంచి టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, జలీల్ ఖాన్ తదితర ఎనిమిది మంది శాసన సభ్యులు ఉన్నారు.
వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కారణంగా హాజరు కాలేదు. వైసిపి నుంచి మరో ఎమ్మెల్యే అనిల్ కుమార్ గైర్హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే వర్మ, యెరపతినేని శ్రీనివాస్ ఓటింగులో పాల్గొనలేదు.
మంత్రి గంటా శ్రీనివాస రావు లండన్ పర్యటనలో ఉన్నారు. కాబట్టి ఆయన గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో తలుపులు మూసివేశారు. దీంతో బయటకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సభలోకి రాలేక, ఓటింగులో పాల్గొనలేకపోయారు.












Click it and Unblock the Notifications