వైసీపీకి ‘ఆ ఒక్కటీ’ దక్కదా?: రాజ్యసభ బరిలో వేమిరెడ్డి, వ్యూహం ఇదే!
అమరావతి: పార్లమెంట్‌లో పెద్దల సభగా భావించే రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన సీట్ల భర్తీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. ఈ నెలఖారు వరకు నామినేషన్లు గడువు ఉంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆయా పార్టీలకు చెందిన అధినేతల వద్ద తమ తమ లాబీయింగ్‌ని ప్రారంభించారు.
రాజ్యసభ సీట్లలో భాగంగా ఏపీకి నాలుగు, తెలంగాణకు రెండు సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా టీడీపీకి మూడు సీట్లు, వైసీపీకి ఒక సీటు దక్కనున్నాయి. అయితే వైసీపీకి దక్కనున్న ఈ ఒక్క సీటును కూడా ఎగరేసుకుపోయేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు తెలుస్తోంది.
ఈ వ్యూహాలకు పదును పెడుతోంది మరెవరో కాదు, మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీతానై ముందుండి నడిపించి ఆ తర్వాత టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డేనని సమాచారం. సోమవారం విజయవాడకు వచ్చిన ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ భేటీలో అటు టీడీపీ వర్గాల్లోనే కాక ఇటు వైసీపీలోనూ ఆసక్తికర చర్చకు తెరలేపింది. టీడీపీకి లభించే మూడు సీట్లలో ఏ ఒక్కటీ తనకు వద్దని చెప్పిన వేమిరెడ్డి, వైసీపీకి దక్కనున్న ఒక్క సీటుకు పోటీ చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారట.
ఆ పోటీలో టీడీపీ తరఫున తనకు అవకాశమివ్వాలని ఆయన చంద్రబాబును కోరినట్లు సమాచారం. మొన్నటిదాకా వైసీపీలో ఉండటం, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడి వద్ద ప్రస్తావించారు.
టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైసీపీ ఎమ్మెల్యేల మద్దతుతో విజయం సాధించి తీరతానని ఆయన చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. వేమిరెడ్డి చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. వైసీపీకి దక్కనున్న ఆ ఒక్క రాజ్యసభ సీటును కూడా లాగేసుకునేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.












Click it and Unblock the Notifications