జనం మర్చిపోలేదు బాబూ.. టీడీపీ మ్యానిఫెస్టోపై వైసీపీ మంత్రుల ఎదురుదాడి..
ఏపీలో టీడీపీ నిన్న రాజమండ్రి మహానాడులో ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల పర్వం కొనసాగుతోంది. టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటనపై వైసీపీ నేతలు,మంత్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు విశ్వసనీయతను ప్రశ్నిస్తూ వైసీపీ మంత్రులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. టీడీపీ గతాన్ని జనం ఇంకా మర్చిపోలేదని వారు గుర్తుచేస్తున్నారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, మేనిఫెస్టోలో 100 పేజీలు పెట్టారన్నారని, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వైసీపీ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడితే రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని చంద్రబాబు గతంలో చేసిన విమర్శల్ని ఆయన గుర్తుచేశారు. ఇవాళ పాత అబద్ధపు హామీలతో కొత్త అబద్ధపు హామీలు కలిపి మేనిఫెస్టో విడుదల చేశారన్నారు.

ఏపీలో వైసీపీ కేవలం రెండు పేజీల మేనిఫెస్టో తో వచ్చి 98.44 శాతం హామీలు నెరవేర్చింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుచేశారు. ఇవాళ్టి నుంచి టీడీపీ కార్యకర్తలు మానిఫెస్టో తో ప్రజల్ని మభ్యపెట్టే పనిలో పడతారన్నారు. రాష్ట్రంలో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వస్తారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరో మంత్రి మేరుగు నాగార్జున కూడా టీడీపీ మ్యానిఫెస్టోపై విమర్శలు గుప్పించారు.
పేదలకు సెంటు భూమి ఇస్తే తట్టుకోలేని వ్యక్తి ఇప్పుడు సంక్షేమ పథకాలను ఇస్తారా అని మంత్రి మేరుగు ప్రశ్నించారు. ఎన్టీఅర్ కు రెండు రూపాయల కిలో బియ్యం, వైయస్ కు ఆరోగ్య శ్రీ లాంటి పేటెంట్ పథకాలు ఉన్నాయని, మరి చంద్రబాబు కు అలాంటి పేటెంట్ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలకు ఎమీ గుర్తు ఉండదు, అన్ని మర్చిపోతారు అన్న ఫిలాసఫీ తో మహానాడు లో మేనిఫెస్టో ప్రకటించారన్నారు.
వైసీపీ ప్రభుత్వం 98 శాతం మేనిఫెస్టో అమలు చేసిందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. మహానాడు లో ప్రకటించిన అన్నీ హామీలు అమలు చేయగలరా అని ప్రశ్నించారు. పూర్ టూ రిచ్ పథకం ఏమిటి, మేము తప్పిదాలు చేసినా ప్రజలు గమనిస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 2.10 లక్షల కోట్ల డీబీటీలో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో నాలుగు రోజుల తర్వాత ఎక్కడ ఉంటుందో తెలియదన్నార. ఇళ్ళ పట్టాలు ఇచ్చిన 17 వేల కాలనీలు సాధ్యమైనంత పూర్తి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications