అంబటి రాంబాబును వదలని కరోనా: మూడోసారి అటాక్: స్టెప్పులు వేసిన వారి పరిస్థితేంటీ?
గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అనూహ్యంగా దూసుకెళ్తోంది. సంక్రాంతి పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు కూడా విధించకపోవడం వల్ల కోవిడ్ పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. నైట్ కర్ఫ్యూను ఇదివరకే విధించినప్పటికీ.. దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.

రాష్ట్రంలో 4,955 కేసులు..
శనివారం నాటి బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 4,955 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో రోజువారీ కోవడ్ కేసులు రికార్డు కావడం ఇదే మొదటిసారి. మరణాలు ఆ స్థాయిలో నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది. కోవిడ్ వల్ల కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,870గా నమోదయ్యాయి. 14,509 మంది మృత్యువాత పడ్డారు.

జిల్లాలవారీగా..
విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం-1,103, చిత్తూరు-1,039 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ స్థాయిలో మరే ఇతర జిల్లాలోనూ రోజువారీ కేసులు రికార్డు కాలేదు. అనంతపురం-212, తూర్పు గోదావరి-303, గుంటూరు-326, కడప-377, కృష్ణా-203, కర్నూలు-323, నెల్లూరు-397, ప్రకాశం-190, శ్రీకాకుళం-243, విజయనగరం-184, పశ్చిమ గోదావరి-55 కేసులు నమోదయ్యాయి.

అంబటిపై మరోసారి వైరస్ అటాక్..
ఈ పరిణామాల మధ్య అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసన సభ్యుడు అంబటి రాంబాబు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయనకు కోవిడ్ సోకడం ఇది మూడోసారి. తనకు వైరస్ సోకిందనే విషయాన్ని అంబటి వెల్లడించారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తన ఆరోగ్యం బాగా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆందోళన పడొద్దని విజ్ఞప్తి చేశారు.

మూడోసారి కావడంతో..
ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని అంబటి రాంబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని కోరారు. కాగా- అంబటి రాంబాబుకు కరోనా వైరస్ సోకడం ఇది మూడోసారి. ఇదివరకు ఆయనపై ఈ వైరస్ రెండుసార్లు అటాక్ చేసింది. తాజాగా మళ్లీ ఆయనపై దాడి చేసిందీ మహమ్మారి. ఇన్నిసార్లు కోవిడ్ వైరస్ మరెవరిపైనా దాడి చేయకపోయి ఉండొచ్చని అంటున్నారు.

స్టెప్పులు వేసిన వారి పరిస్థితేంటీ?
భోగి పండగనాడు అంబటి రాంబాబు స్టెప్పులతో అదరగొట్టిన విషయం తెలిసిందే. కొందరు లంబాడీ మహిళలతో కలిసి భోగి మంటల చుట్టూ స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా ఆయన వైరస్ బారిన పడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. భోగి, సంక్రాంతి పండగ నాడు ఆయనను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు కోవిడ్ టెస్టింగులను జరిపించుకోవాల్సి వచ్చింది.