వచ్చే ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన బాలినేని- ఎంపీ మాగుంటతో పాటు
ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహార శైలి కొద్దిరోజులుగా చర్చనీయాంశమౌతూ వస్తోంది. సొంత పార్టీ అగ్రనాయకత్వంపై ఆయన అసంతృప్తి, అసహనంతో ఉంటోన్నారు. తన మాట చెల్లుబాటు కావట్లేదని అభిప్రాయంలో ఉన్నారనే వాదనలు లేకపోలేదు.
ఈ ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పదవికీ బాలినేని ఇదివరకే రాజీనామా చేశారు. తన వైఖరిని స్పష్టం చేశారు. అటు పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటోన్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన కొందరు పార్టీ సీనియర్ నాయకులు తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఫిర్యాదులు చేస్తోన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలనేది బాలినేని డిమాండ్. ఇది నెరవేరట్లేదు.

ఇదే అంశం మీద ఆయన ఇదివరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ కలిశారు. జిల్లా రాజకీయాల్లో తాను ఎదుర్కొంటోన్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత కూడా బాలినేని చేసిన కొన్ని వ్యాఖ్యలు.. పార్టీపై అసంతృప్తితోనే ఉన్నారనే విషయాన్ని బయటపెట్టినట్టయింది.
ఈ పరిస్థితుల మధ్య బాలినేని మరోసారి మీడియా ముందుకొచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఒంగోలు నుంచే పోటీ చేయబోతోన్నానని తేల్చి చెప్పారు. ఇందులో ఎలాంటి మార్పూ ఉండబోదని అన్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇకపై విస్తృతంగా పాల్గొంటానని బాలినేని స్పష్టం చేశారు. తాను కొంత స్లోగా ఉన్నానని వైఎస్ జగన్ చెప్పారని, ఇక టాప్ గేర్‌లో వెళ్తానని వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలను తెలుసుకునే క్రమంలో కొంత స్లో అయిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
తన పోటీపై ఎన్నో రకాలుగా వార్తలు, ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు ఎంపీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు అసెంబ్లీకి తాను పోటీ చేస్తామని అన్నారు. అవాస్తవాలను రాయడం ఒక వర్గానికి చెందిన మీడియాకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications