కాకినాడలో చూసుకుందాం రా..! పవన్ కు ద్వారంపూడి సవాల్..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇదే క్రమంలో గతంలో కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ కు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ సవాల్ విసిరారు. ఇప్పుడు టీడీపీ-జనసేన టికెట్ల పంపకాల నేపథ్యంలో మరోసారి ద్వారంపూడి పవన్ కళ్యాణ్ కు అదే సవాల్ విసిరారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో జనసేన గుర్తు గాజు గ్లాసును బ్యాలెట్ పేపర్ తో కప్పేస్తామన్నారు.
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. గత కొద్ది రోజులుగా పొత్తులు, సీట్ల పంపకాలపై చంద్రబాబు-పవన్ కళ్యాణ్ తర్జన భర్జన పడుతున్నారని ద్వారంపూడి విమర్శించారు. తాను కూడా ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తనపై వారాహి యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ లేనిపోని ఆరోపణలు చేశారని, ఆయనకు తాను ఓ సవాల్ కూడా విసిరినట్లు గుర్తుచేశారు.

తన మీద పవన్ కళ్యాణ్ మాట్లాడేవన్నీ అవాస్తవాలే అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిజమేంటో, అబద్ధమేంటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా రా అన్నారు. తద్వారా కాకినాడ సిటీలో పోటీకి పవన్ కళ్యాణ్ ను ఆయన ఆహ్వానించారు.
తనపై పవన్ ఓడిపోతే ఆరోపణలన్నీ అవాస్తవం అన్నారు. పవన్ గంట ప్రసంగం చేస్తే 50 నిమిషాలు తన గురించే మాట్లాడుతున్నారని ద్వారంపూడి ఆరోపించారు. తన సవాలును పవన్ స్వీకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. జనసేన నేతలు పవన్ వరకూ ఎందుకంటున్నారని, అయితే ఆ పార్టీ నుంచి ఎవరినైనా తనపై పోటీకి పెట్టి గెలిపించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications