అన్నకు షాక్ ఇచ్చి చెల్లి పార్టీలో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే
MLA Eliza: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడులైన వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు. టికెట్ దక్కుతుందనే ఉద్దశంతో ప్రత్యామ్నాయ పార్టీల కండువాలను కప్పుకొంటోన్నారు.
వైఎస్ఆర్సీపీ, టీడీపీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, డాక్టర్ సంజయ్ కుమార్, కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అర్థర్, వరప్రసాద్ వంటి నాయకులు పార్టీలను ఫిరాయించిన నాయకుల జాబితాలో ఉన్నారు.

ఈ జాబితాలో తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన మరో శాసనసభ్యుడు పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా వైసీపీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిలను కలిశారు. ఆమె చేతుల మీదుగా కండువా కప్పుకొన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉన్నమట్ల ఎలీజా.. చింతలపూడి నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన కర్రా రాజారావును మట్టికరిపించారు. 36,175 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ జెండా పాతారిక్కడ.
ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ అధిష్ఠానం. ఎస్సీ- మాల సామాజిక వర్గానికి చెందిన కంభం విజయ రాజుకు టికెట్ ఇచ్చింది. దీనితో ఎలీజా పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరారు. ఇదే చింతలపూడి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే.
ఈ ఉదయమే తిరుపతి జిల్లా గూడూరు శాసన సభ్యుడు వెలగపల్లి వరప్రసాద్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. దేశ రాజధానిలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొన్నారు. ఆయనకు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం టికెట్ దాదాపుగా ఖరారైనట్టే.












Click it and Unblock the Notifications