హత్యా రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబుదే: మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్
తెలుగుదేశం పార్టీ నేత చంద్రయ్య హత్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైసీపీ గుండాలే చంద్రయ్యను హతమార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, టిడిపి నేతలందరూ వైసీపీ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. జగన్ హత్య రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలన మొదలైన నాటి నుండి ప్రతిపక్షాన్ గొంతు నొక్కేస్తున్నారు అని ప్రశ్నించే వారిని హతమారుస్తున్నారని టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

వైసీపీ హత్యా రాజకీయాలు చేస్తుందని చంద్రబాబు ఆరోపణ
ఏపీలో అరాచక పాలన సాగుతోందని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలపై నేతలపై దాడులు కొనసాగుతున్నాయని, వందల సంఖ్యలో కార్యకర్తలు ప్రాణాలు వైసీపీ హయాంలో గాలిలో కలిసిపోయాయని తెలుగు తమ్ముళ్లు జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. గురువారం చంద్రయ్య హత్య నేపధ్యంలో గుండ్లపాడు కి వెళ్లిన చంద్రబాబు కూడా చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొని జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైసిపి హత్యా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

హత్య రాజకీయాలకు పేటెంట్ అంతా చంద్రబాబుదే
ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రివర్స్ కౌంటర్ ఇచ్చారు. హత్య రాజకీయాలకు పేటెంట్ అంతా చంద్రబాబుదేనని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటనను వైసిపికి అంటగడుతూ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై జోగి రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒంటరిగా వైసీపీ ని ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు పొత్తుల కోసం ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు.

పొత్తుల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కొల్లగొట్టాలని చంద్రబాబు కుట్రలు
పొత్తుల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కొల్లగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. అంతేకాదు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఏకమైనప్పటికీ ప్రజా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని ఎమ్మెల్యే జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో వైసిపి మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని పేర్కొన్న జోగి రమేష్ మళ్లీ ప్రజలు వైసీపీకే పట్టం కడతారని తేల్చిచెప్పారు. ఏపీ సీఎంగా మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు బాధ్యతలు చేపడతారని జోగి రమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈ తరహా నీచ రాజకీయాలకు పాల్పడుతూనే ఉంటారని, అందుకే ప్రజలు రానున్న ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు.

పాత కక్షల వల్లే చంద్రయ్య హత్య, వైసీపీకి సంబంధం లేదన్న పిన్నెల్లి
ఇక ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, చంద్ర హత్య కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. పాత కక్షల వల్లే చంద్రయ్య హత్య జరిగిందని గుండ్లపాడులో టీడీపీ నేత చంద్రయ్య హత్య ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. వైసిపికి ఆ హత్యకు ఎటువంటి సంబంధమూ లేదని ఆయన తేల్చి చెప్పారు. కావాలని చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కేవలం వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరిస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications