బీజేపీలో చేరిన వైసీపీ రాయలసీమ ఎమ్మెల్యే..!
ఏపీలో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఇవాళ అనూహ్యంగా విపక్ష బీజేపీలో చేరారు. ఇప్పటివరకూ వైసీపీ నుంచి టీడీపీ, జనసేనకు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫిరాయించగా.. ఇప్పుడు తొలిసారి ఓ ఎమ్మెల్యే కాషాయ పార్టీలో చేరిపోయారు. తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయిన ఆయన.. ఇవాళ బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతల సమక్షంలో పార్టీలో చేరారు.
రాయలసీమలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్దితి ఏమాత్రం మెరుగుపడకపోవడం, అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదరడం వంటి కారణాలతో ఆయన కాషాయ పార్టీలోకి ఫిరాయించినట్లు తెలుస్తోంది.

ఇవాళ కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఇందులో కాపు రామచంద్రారెడ్డి సహా పలువురు ఉన్నారు. వీరంతా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావ్డే సమక్షంలో పార్టీలో చేరారు. కాపుతో పాటు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక, డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ దంపతులు, ఎన్టీఆర్ జిల్లా కాకాని వెంకటరత్నం నాయుడు మనవడు తరుణ్ కాకాని వంటి వారున్నారు.

నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచడానికి పలువురు పార్టీలో చేరారని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజావేదిక కూల్చడంతో విధ్వంసకర పాలన చేసారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే.. ఎన్నికల్లో అడుగుపెట్టినట్లేనన్నారు. ఎన్నికలలో జరిగే అవకతవకలపై అప్రమత్తం గా ఉండాలన్నారు. దొంగ ఓట్లు వేయించుకోవడానికి సమాయత్తం అయ్యే వై నాట్ 175 అంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications