రోజా షాకింగ్ కామెంట్స్-అమరావతి ఉద్యమంతో ఉత్తరాంధ్రకు ద్రోహం-రియల్టర్ల పోరాటం
ఏపీలో వైసీపీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధానే కావాలని కొంతకాలంగా పోరాటాలు చేస్తున్న అమరావతి రైతులు, విపక్ష పార్టీలు.. ఎట్టకేలకు తిరుపతి వేదికగా గట్టిగా తమ డిమాండ్ వినిపించగలిగాయి. దీంతో వైసీపీ నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అమరావతి ఉద్యమంతో పాటు విపక్షాలపైనా తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే వారికి ద్రోహం చేసి అమరావతిలో రాజధాని పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. భూముల రేట్లు పెంచుకోవడం కోసమే అమరావతి రైతుల పోరాటమని ఆమె అన్నారు. ఇంతకాలం ముసుగు వేసుకున్నవాళ్లు జగన్ పై విషం కక్కుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే... ఇతర పార్టీల నేతలు కేవలం అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు బాగుండాలని కోరుకోడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇంతకాలం ముసుగు వేసుకున్న దొంగలు ఇప్పుడు జగన్ పై విషం కక్కుతున్నారని విపక్ష పార్టీలను ఉద్దేశించి రోజా మండిపడ్డారు. నిన్న తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభ గురించి మాట్లాడుతూ .. అమరావతి రైతుల సభలో పాల్గొన్న చంద్రబాబు సహా ఇతర నాయకులందరూ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
నిన్న అమరావతి సభ చూస్తుంటే క్యాపిటల్ సిటీ కోసం జరిపిన మీటింగ్ లా లేదని, క్యాపిటలిస్టులు జరిపిన సభలా ఉందని రోజా విమర్శించారు. దొంగలంతా ఒక చోట చేసి రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో జనం చూశారన్నారు. నిన్న మీటింగ్ లో పాల్గొన్న వారంతా రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని రోజా ఆరోపించారు. గతంలో కర్నూల్లో రెండో రాజధాని పెట్టాలని అడిగిన వారు నిన్న స్టేజ్ పై అమరావతిలోనే రాజధాని ఉండాలని ఎలా కోరతారని రోజా నిలదీశారు. ప్రజలు అసహ్యించుకుంటున్న వారే నిన్న అమరావతి డిమాండ్ చేశారన్నారు. ప్రజలు వీరందరినీ నిలదీయాలని రోజా పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications